- రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం
- పర్యావరణ సమతుల్యత అవశ్యం
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: భూ సమస్యలు, వ్యవసాయరంగ సమస్యలు ఎదుర్కొంటున్న పేద రైతులు, వ్యవసాయ కూలీల న్యాయ సహాయార్థమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సుజయ్ తో కలిసి గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనల మేరకు గుర్తించబడిన గ్రామాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతు విత్తనం వేసే మొదలు నీటి సౌకర్యం లేక, కూలీలు దొరకక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పంట బీమా వల్ల వచ్చే పరిహారం నామమాత్రంగా ఉండడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. తాను స్వయంగా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తినని, ఖాళీ సమయాలలో కుటుంబంతోపాటు వ్యవసాయం పాడి పంటల అభివృద్ధికి సమయాన్ని కేటాయిస్తానని అన్నారు. ప్రకృతి సిద్ధమైన ఎరువుల తయారీ కోసం పశువుల పెంపకాన్ని గ్రామాలలో ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రారంభం చేసే ముందు పది సంవత్సరాల క్రితమే ఒక అతి చిన్న గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి అమలు చేశారన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతుల యొక్క అనేక సమస్యలు అయ్యాయని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి వచ్చిన అనేక సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించామని తెలిపారు. పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటే మనిషి మనుగడకే ప్రమాదమని, రైతు క్షేమమే దేశ క్షేమమని ఆమె కొనియాడారు. పారిశుద్ధ్యంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న గన్నేరువరం గ్రామపంచాయతీ పాలకవర్గానికి, గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. అంతకుముందు ఖాసీంపేట శ్రీ స్వయంభు మానస దేవి ఆలయం, పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రధాన అర్చకులు.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహీర్కార్, జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త గూడెల్లి తిరుపతి,కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, సభ్యుడు జక్కనపల్లి గణేష్, ఆర్ఎస్ఎస్ మండల సమన్వయకర్త తిరుపతిరెడ్డి, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.









