హైదరాబాద్: మహారాష్ట్ర నడిగడ్డలో, సిటీ ఆఫ్ గేట్స్‌గా పేరుగాంచిన శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో బీఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభపై జిల్లా కేంద్రంలోనే కాకుండా మారుమూల పట్టణాల్లోనూ జోరుగా చర్చ సాగుతున్నది. ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మరాఠా ప్రజల గుండెను హత్తుకొంటుండగా, అన్ని వర్గాల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. బీఆర్‌ఎస్ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో నిర్వహిస్తున్న మూడో సభపై అందరిలోనూ ఉత్సుకత నెలకొన్నది. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన మొదటి సభకు ఊహించని రీతిలో రైతులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 26న చిన్న తాలుకా కేంద్రమైన లోహలో సభ నిర్వహించగా వేల మంది రైతులు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు నీరాజనం పలికారు. ఈ నేపథ్యంలో సోమవారం చారిత్రక నగరమైన చత్రపతి శంభాజీ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సభపై రాష్ట్రవ్యాప్తంగా అమితాసక్తి నెలకొన్నది.
సర్వం సిద్ధం:
చత్రపతి శంభాజీనగర్ పట్టణ కేంద్రంలోని జబిందా ఎస్టేట్స్‌లో సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. పట్టణమంతా గులాబీమయమయ్యింది. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, భారీ హోర్డింగులతో అలంకరించారు. వాటిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలచారి, బీఆర్‌ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్‌రావు కదం, కాంధర్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితరులు పర్యవేక్షిస్తున్నారు.