కరీంనగర్ జిల్లా: జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షాలకు వరి, మొక్కజొన్న,మిరప పంటలతోపాటు పండ్లతోటలు పూర్తిగా దెబ్బతిన్నందున ఎకరాకు లక్ష రూపాయల చొప్పున నష్ట పరిహారం సత్వరమే అందించి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ వంచ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ కు టీడీపీ ప్రతినిధి బృందంతో కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. నష్టపోయిన రైతులకు పరిహారంతోపాటు రుణమాఫీ వర్తింపజేయాలని, భారీ నష్టం చవిచూసిన చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరవు మండ లాలుగా ప్రకటించాలని శ్రీనివాస్ రెడ్డి ఆ వినతిపత్రం లో డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా దాదాపు 25వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వర్షాలు రైతులకు కడగండ్లను మిగిల్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరువులు, పిడుగుపాట్లతో వచ్చి పడుతున్న వడగళ్ల వర్షాలకు రైతులు బెంబేలెత్తిపోతున్నారని, వరి, మొక్కజొన్న పంటలు నేలకొరగగా, మిరప తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.. కల్లాల్లోను, కొనుగోలు కేంద్రాల్లోను రాశులుగా పోసిన ధాన్యం వానలో కొట్టుకుపోగా, మిగిలిపోయిన కొద్దిపాటి ధాన్యం తడిసి ముద్దయిందని, కోతకు వచ్చిన మామిడి నేలరాలయన్నారు. కోత వచ్చిన దశలో వడగళ్ల వానలు పంటలను నేలపాలు చేయడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని, అప్పు చేసి పంటలకు పెట్టిన పెట్టుబడి రాకుండాపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో చొప్పదండి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల తదితర మండలాల్లో వడగళ్ల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయని, అలాగే మానకొండూర్, తిమ్మాపూర్,ఇల్లంతకుంట, హుజూరాబాద్,జమ్మికుంట, చిగురుమామడి తదితర మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.జిల్లాలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు సృష్టించిన విలయాన్ని తట్టుకోలేక రైతులు విలవిల్లాడుతున్నా జిల్లా అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరించడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి నష్టం అంచనాలు తయారు చేయకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా అధికారుల బృందాన్ని గ్రామాలకు పంపించి సర్వే చేయించాలని, పంట నష్టాలను అంచనా వేయించి సత్వరమే నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని, గతంలో మాదిరిగా కాకుండా నష్ట పరిహారాన్ని సత్వరమే అందించాలని, అలాగే గత వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాలను కూడా ఇప్పుడే రైతులను పూర్తిస్థాయిలో అందించి ఆదుకోవాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కలెక్టర్ ను కలిసిన టీడీపీ ప్రతినిధుల బృందంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం,
చొప్పదండి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ జంగం అంజయ్య,పార్టీ సీనియర్ నాయకులు గంగాధర కనకయ్య,మైలారం శ్రీనివాస్ రెడ్డిఓరుగల తిరుపతి తదితరులు ఉన్నారు.