గద్వాల: తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ 8 వ రోజు సమ్మెలో భాగంగా రంగవల్లికల ద్వారా తమ నిరసనను తెలిపారు. శాంతియుతంగా న్యాయబద్ధంగా ప్రభుత్వానికి విన్నవించుకున్న ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం డివిజన్ అధ్యక్షులు రాధాగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెషనరీ మూడు సంవత్సరాల కాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలు న్యాయబద్ధమైన తమ సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తూ మద్దతు తెలుపుతున్నారని ఆయన చెప్పారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం తమతో చర్చలు జరిపి రెగ్యులరైజ్ చేయాలని ఆయన సూచించారు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికై గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సూత్రధారులైన పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు రాధాగోపాల్, ప్రధాన కార్యదర్శి భరత్ నాయుడు, పాండు, కోశాధికారి బసిరెడ్డి, వసంత కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, భాస్కర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ, సభ్యులు పరమేష్, గురునాయక్, రమేష్, తిరుమలేష్, రమ్య, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.