పాడేరు: గిరిజనుల సామాజిక, ఆర్ధిక పరిస్థితులను చూసి చలించిపోయి వారి
సమస్యలు పరిష్కరించటానికి, వారి సంక్షేమమే ధ్యేయంగా బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు మనందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ కొనియాడారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతిని పురష్కరించుకొని కలక్టరేట్ ఆవరణలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ, అటువంటి మహనీయుని ఆదర్శాలు స్ఫూర్తిగా తీసుకుని గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం పునరంకితం అవుదామని కలక్టర్ పిలుపు నిచ్చారు. అల్లూరి సేవలను, బ్రిటిష్ వారిపై అల్లూరి తిరుగుబాటు నుస్మరించుకున్నారు. అల్లూరి సీతారామ రాజుకు జ్యోతిష్యశాస్త్రం, మూలికాశాస్త్రం, గుర్రపు స్వారీపై మక్కువ ఎక్కువని, తీర్ధ యాత్రలన్నా ఆసక్తి ఎక్కువేనని తెలిపారు. బ్రిటిష్ వారిపై దాడి చేయటానికి వీలుగా, పాపికొండలు ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగావున్న ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకొని గిరిజనలను చైతన్య పరిచారన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే కేవలం 27 ఏళ్ళ వయసులో తన ప్రాణాలను అర్పించిన మహాయోధుడు అల్లూరి అని విశ్లేషించారు. ఆదివాసులు, రైతులు, సానుభూతిపరుల శక్తులను సమీకరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటాలలో నిమగ్నమయ్యారని, అనేక పోలీస్ స్టేషన్ల మీద దాడిచేశారని, అతని వీరోచిత పరాక్రమాలను చూసి గ్రామస్తులు అతనిని “మన్యంవీరుడు” గా కీర్తించారని కలక్టర్ వివరించారు. దాడులకు ప్రతిస్పందనగా తిరుగుబాటును అణచి వేయడానికి బ్రిటిష్ అధికారులు అల్లూరి సీతారామరాజు కోసం రెండేళ్లు సుదీర్ఘ అన్వేషణ చేపట్టి చివరకు 1924 లో మే 07 న చింతపల్లి అడవులలోని కొయ్యూరు గ్రామంలో పట్టుకుని ఎటువంటి విచారణ లేకుండా సీతారామ రాజునుకాల్చి చంపారని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు పేరుతో మనకు కొత్త జిల్లా ఏర్పాటు చేయడం అభినందనీయమని, అందుకు ప్రభుత్వానికి ఋణపడి ఉందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టర్ జే. శివ శ్రీనివాసు, డిఆర్ఓ పి. అంబేద్కర్, కలక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
