- తిరుమలేశుడి లడ్డూ చారిత్రక నేపథ్యం పై ప్రత్యేక కథనం.
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీవారికి…లడ్డూ ప్రసాదమంటే మహా ప్రీతి. అందుకే లడ్డూకు అంతటి ప్రాముఖ్యత లభించింది.శ్రీనివాసుకి సమర్పించే…ప్రసాదాలలో ‘లడ్డూ’ను మహా ప్రసాదమంటారు. శ్రీవారిని దర్శించుకునేవారు, ఆరాధించేవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది శ్రీవారి లడ్డూ. ఈ మహా ప్రసాదం లడ్డూకోసం పరితపించేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అంత విశిష్టమైన లడ్డూకు 307 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటినుంచి ఇప్పటి వరకు రుచిలో, నాణ్యతలో సాటిలేనిదిగా గుర్తింపు పొందింది. రుచికరంగా తయారవుతున్న లడ్డూలు సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, పచ్చకర్పూరం, నెయ్యితో ఘుమఘులాడుతుంటాయి. 1940 నుంచి లడ్డూలో రుచి, నాణ్యతలో మార్పులేమీ లేకుండా రుచికరంగా తయారవడం విశేషం. సాధారణ రోజుల్లోనే లక్షలమంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తారు. ఇక బ్రహ్మోత్సవాలకైతే లెక్కే లేదు. ఇక ఈ మహాప్రసాదం..చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే….
తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమయంలో స్వామి వారికి వెన్నతో మొదలు పెట్టి, లడ్డూ, వడ, పోంగలి, దద్దోజనం, పులిహోరా, వడపప్పు, ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు. తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది. శ్రీవారికి ప్రాచీన కాలంలో నుంచి అనేక ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ.. మనకి పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య, మరింత ఎక్కువ పెంచినట్టు ఆధారాలున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన శేఖర మల్లన్న, కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్టు తెలుస్తుంది. రెండవ దేవరాయల కాలంలోనే స్వామి వారికి నివేదించాల్సిన ప్రసాదాలు, సమయాన్ని బట్టి ఖరారు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
శ్రీవారి ఆలయంలో స్వామి వారికి రకరకాల ప్రసాదాలు నివేదిస్తునప్పటికీ, స్వామి వారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డూ. ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రసాదాల్లో లడ్డూను పురాణకాలం నుంచి స్వామి వారికి నివేదిస్తున్నటు తెలుస్తుంది.14వందల 55వ సంవత్సరంలో సుఖీయం, అప్పంను, 14వందల 60 లో వడను, 14వందల 68లో అత్తిరసంను, 15వందల 47లో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశ పెట్టినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు.. అయితే అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 18వందల3 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభించారు. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 19వందల 40లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్దతులను టీటీడీ పాటిస్తోంది.
లడ్డూకు వాడే పదార్ధాలకు ”దిట్టం”అని పేరు. తయారుచేసే ప్రదేశాన్ని ”పోటు”గా వ్యవహరిస్తారు. ఆదునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం రోజూ లక్ష లడ్డూలను తయారు చేస్తున్నారు. శ్రీవారి పోటులో తయారు చేసిన లడ్డూ మాదిరిగా తయారు చేసేందుకు ఎన్నో సంస్థలు ప్రయత్నించి విఫలమైయ్యాయి.
ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్చమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలాకులు, జీడీపప్పు, పచ్చకర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. 51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి సుమారు వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51 వేల లడ్డూలన్న మాట. ఇందుకు గాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 18వందల 50 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, 80 ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరం అవుతుంది. రోజుకు లక్షా పాతిక వేల లడ్డూలను టీటీడీ కార్మికులు తయారు చేస్తున్నారు.
టీటీడీలో రకరకాలైన ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికి, భక్తులకు లడ్డూ ప్రసాదం అంటేనే ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది. ఈ లడ్డూ ప్రసాదాల విక్రయాలతో, ప్రతి ఏటా టీటీడీ కోట్ల రూపాయలు ఆదాయంగా పొందుతూ వస్తోంది. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 17వందల 15 ఆగస్టు 2 వ తేదీన మెదలుపెట్టారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేక పోతున్నారు. 2వేల 10 వరకూ దాదాపు రోజుకు లక్షల లడ్డూలను టీటీడీ తయారు చేసేది. భక్తుల అధిక రద్దీ నేపధ్యంలో ప్రతి నిత్యం దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. ఇక లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం నుండి 2వేల 14లో రిజిస్ట్రేషన్ అవుతూ, జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా లడ్డూకు లభించింది.ఇలా శ్రీవారి లడ్డూ.. ప్రత్యేక గుర్తింపు పొంది..భక్తులకు మహా ప్రసాదంగా.. మాధుర్యంతో పాటు, పవిత్రతకు మారు పేరుగా నిలిచింది.