అల్లూరి జిల్లా, అనంతగిరి: అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీ మారుమూలగ్రామమైనటువంటి తముటు గ్రామానికి రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ఎంపీపీ శెట్టి నీలవేణి హామీ ఇచ్చారు. ఆ గ్రామంలో జరిగిన స్థానిక సర్పంచ్ సిరగం గణేష్ మేనకోడలు రజస్వల కార్యానికి కాలినడకన గెడ్డలు దాటి వెళ్లిన ఆమె రహదారి సమస్యపై చర్చించారు. గ్రామానికి రహదారి వేయాలంటే స్థానిక గిరిజనులకు చెందిన పొలాల మీదుగా వేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత భూమిని సేకరించాల్సి ఉందని స్థానిక సర్పంచ్ గణేష్ ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు.ఈ మేరకు స్థానికులతో చర్చించి స్థల సేకరణకు అవసరమైన నిధులను సమీకరించి సమస్యను పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపు తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె తోపాటు సర్పంచులు ఫోరం అధ్యక్షులు పాగి అప్పారావు, కన్వీనర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
