కోవిడ్ నిబంధనల కింద ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సహా పది మంది కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోవింద్ పుర పారిశ్రామిక వాడలో ఆర్‌ఎస్ఎస్‌కు భూమి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ దిగ్విజయ్, సుమారు 200 మంది కార్యకర్తలు నిరసనలు దిగారు. భోపాల్‌లో 144 సెక్షన్ అమల్లో ఉండగా నిరసనలకు దిగడంతో సెక్షన్ 188, 147, 269 కింద వారిపై అశోక గార్డెన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దిగ్విజయ్‌తో పాటు మాజీ మంత్రి పిసీ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాష్ మిశ్రా తదితర నేతలపై కేసులు నమోదు చేశామని, వీడియోను తనిఖీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన లఘు ఉద్యోగ్ భారతి సంస్థకు 10,000 చదరపుటడుగుల భూమిని శివరాజ్ సింగ్ ప్రభుత్వం కేటాయించిందని, నిజానికి అందులో గార్డెన్ ఉందని దిగ్విజయ్ ఆరోపించారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్‌లను ప్రయోగించారు. కొద్దిసేపు తర్వాత ఆందోళనకారులు బైఠాయింపు నిరసనకు దిగారు. దీనికి ముందు, జిల్లా కలెక్టర్ అవినాష్ లవానియా, డీజీఐ ఇర్షాద్ వాలితో దిగ్విజయ్ వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకుండా ధర్నాకు దిగిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ధర్నా అనంతరం లవానియా తెలిపారు.