ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచి నిప్పుల సెగ మొదలువుతోంది. వడగాల్పుల ధాటికి ప్రజలు అల్లాడుతున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతో పాటుగా వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తలు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రోజు కూడా భారీ ఉష్ణోగ్రతలతో పాటుగా వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు: ఏపీ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ ప్రభావం, వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించారు. ఈరోజు మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా, మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉండనుంది. విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43- 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
వడగాల్పుల హెచ్చరికలు: పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి- 44 డిగ్రీల ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. వైఎస్ఆర్ జిల్లా 4 మండల్లాలో తీవ్రవడగాల్పులు, మిగిలిన చోట్ల మొత్తం 38 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది.
అప్రమత్తంగా ఉండాలి: ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాల దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ కు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో కోస్తా, రాయసీమల్లో అక్కడక్కడా గురువారం నుంచి ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు.
