contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చరిత్రకు నిలవుటద్దం చంద్రగిరి కోట … శ్రీకృష్ణదేవరాయల రెండవ రాజధాని

చారిత్రక నేపధ్యానికి మూలాధారం చంద్రగిరి కోట.శ్రీకృష్ణదేవరాయల వారికి రెండవ రాజధానిగా భాసిల్లింది.ఆనాటి వైభవాన్ని తెలియజేసే పురాతనమైన కోట. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని, నేటికీ చెక్కు చెదరకుండా…, నవీన యుగ ప్రజలను సైతం ఆకర్షిస్తున్న అపురూప కట్టడం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న చంద్రగిరిలో నిర్మించబడింది. విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంబంధం ఉన్నప్పటికీ, దీన్ని 11 వ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించినట్లు అక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది.

చంద్రగిరి కోట.. విజ‌య‌న‌గ‌ర రాజుల పాల‌న‌లో ఓ వెలుగు వెలిగింది.. అయితే.. ఇప్పటికీ ఆ కోట‌లో ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు, కళ్ళు కూడా నమ్మలేని రహస్యాలు ఉంటే, మరికొన్ని ప్రాంతాలలో సైన్స్కు కూడా అందని ఎన్నో వింతలు,విశేషాలు ఆధునిక ప్రజలను ఆకర్షిస్తున్నాయి.శత్రు దుర్భేధ్యమైన చంద్రగిరి కోటను అర్థ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో నిర్మించడం వల్ల, దీనికి చంద్రగిరి కోట అనే పేరు వచ్చింది. ఈ కోట నిర్మాణంలో వాడిన సాంకేతిక ఇప్పటి అత్యాధునిక ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి ఏమాత్రం తీసిపోక‌పోవ‌డం విశేషం.. . శ‌త్రురాజులు అంత త్వర‌గా ఈ కోట‌ను జ‌యించ‌డానికి వీలు లేకుండా.. దీని నిర్మాణాన్ని ఎంతో వ్యూహాత్మ‌కంగా చేప‌ట్టారని చెబుతుంటారు చ‌రిత్ర‌కారులు.. ముఖ్యంగా.. కొండ పాదభాగంలో ఈ కోటను నిర్మించడం వల్ల.. ఆ కొండ ఈ కోట‌ను స‌హ‌జసిధ్దంగా ర‌క్షించినట్లుగా కూడా రూపొందించారు.. అంతేకాదు.. ఈ కోట కొండకు దగ్గరగా ఉండటం వల్ల , కొండపైకి ఎక్కితే దూరంగా వచ్చే వారి కదలికలను కూడా సులభంగా గుర్తు పట్టవచ్చు.

ఇక‌.. కోట చుట్టూ దాదాపు ఒకటిన్నర కిలోమీటరు వ‌ర‌కు దృఢ‌మైన ప్రహారి గోడ ఉంది.. దీనికోసం పెద్ద పరిమాణంలో ఉండే రాళ్లను వినియోగించారు.. అంత ఎత్తు, పొడవు ఉండే కోట గోడకు పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లను వినియోగించడం సాంకేతికపరంగా అంతగా ఎదగని ఆ కాలంలో ఎలా సాధ్యమయ్యిందన్న విషయం ఇప్పటికీ అంతుపట్ట‌ని ఓ మిస్ట‌రీ.. ఇక ఈ కోట గోడను అనుసరిస్తూ ఒక వైపునకు కందకం ఉంది. అప్పట్లో ఈ కందకంలో మొసళ్లను వదిలేవారని తెలుస్తోంది. అక్కడి స్థానిక పరిస్థితులను చక్కగా మలుచుకుని శత్రు దుర్భేధ్యమైన కోట నిర్మాణం చేయడమే కాకుండా శత్రు వర్గాల పై నిఘా కూడా వహించేలా రాజులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కోట నిర్మాణాన్ని బట్టి అర్థమవుతోంది. చరిత్రకారులతో పాటు పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ విషయాలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా చంద్రగిరి కోటలో మనం చూడవచ్చు..
విజయ నగర రాజుల చరిత్రలో ఈ చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు.
క్రీ.శ.1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసాక‌.. విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నేళ్ళ పాటు పెనుకొండకు మార్చారు. పెనుకొండ తర్వాత ఇంకొన్నేళ్ళకు చంద్రగిరికి మారిపోయింది. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రగిరి కొండ పై భాగాన ఒక సైనిక స్థావరాన్ని నిర్మించారు. వారి అవసరాల నిమిత్తం పై భాగంలో రెండు చెరువులను నిర్మించి క్రింది నున్న పెద్ద చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని కోట మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తోంది.. అయితే.. ఇప్పటికీ ఆ కొండపైకి నీటిని ఎలా పంపించారు.. ఎందుకు పంపించారు.. అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ కాలంలో నీటిని పైకి పంపించేందుకు ఉపయోగించిన సాధనాలు పాడయిపోయినప్ప‌టికీ.. పైన చెరువులు, క్రింద చెరువు ఇప్పటికీ మంచి నీటితో కనిపిస్తుండ‌డం విశేషం..
కోటలో చూడదగినది రాణీమహల్‌, రాజ్‌ మహల్‌. రాణీ మహల్‌ రెండు అంతస్తులు కలిగి ఉంటే రాజ్‌ మహల్‌ మూడు అంతస్తులతో అందంగా కనిపిస్తుంది. రాణీ మహల్‌ నిర్మాణాన్ని అనుసరించి అది గుర్రపు శాల కావచ్చునని పురాతన శాఖ అభిప్రాయపడుతోంది. ఇందుకు సంబంధించిన బోర్డు కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. రాణీ మహల్‌ వెనుక వైపున కొంచెం దూరంలో ఒక దిగుడు బావి ఉంది. దీని నుంచే అంత:పురం అవసరాలకు మంచినీటిని సరఫరా చేసేవారు. ఇందులోనికి నీరు వర్షంతో పాటు దగ్గర్లో ఉన్న చెరువుల నుంచి కూడా వచ్చి చేరేలా నిర్మాణం చేశారు. ఇక ఈ బావికి పక్కగా మరణ శిక్ష పడ్డ ఖైదీలకు ఉరిని అమలు చేసేవారు. అందుకు అనుగుణంగా ఆరు స్తంభాలను వాటికి ఉక్కు రింగులను కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం రాజమహల్‌ మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు..అయితే.. రాణీమ‌హ‌ల్ ప‌క్కన ఆ బావి ఎందుకు ఉందో.. అక్కడే ఖైదీల‌కు ఉరిశిక్ష ఎందుకు అమ‌లు చేసేవారో ఇప్పటికీ అంతుచిక్కని ఓ మిస్టరీనే..

ఇకపోతే… మహావిష్ణువు దశావతారాలతో కూడిన శిల్పకళలలు..సకల దేవతల ప్రతిమలతో నిర్మించిన మండపాలు.. ఒకే బండ నుంచి వచ్చే ఊటలో వేర్వేరు రుచులు.. భటుల విశ్రాంతి కోసం ప్రత్యేక ఆవాసాలు.. ఆశ్చర్యపరుస్తున్న రాతికంచాలు.. అంతుచిక్కని కోనేటి అందాలు.. ఇవీ చంద్రగిరి దుర్గం కోటని అద్భుత దృశ్యాలు.. శ్రీకృష్ణదేవరాయల నాటి శిల్పకళా సౌందర్యాలు, వింతలు, విశేషాలు మరెన్నో నిక్షిప్తమై ఉన్నాయి.

చంద్రగిరి రాయలవారికోట ముందు భాగంలో ఉన్న ఎత్తైన కొండనే చంద్రగిరి దుర్గంగా పిలుస్తుంటారు. శ్రీకష్ణదేవరాయల వారు చంద్రగిరి కోటపై శత్రుమూకలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, ముష్కరుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఈ కొండను ఎంచుకున్నారు. కోట నుంచి దుర్గం కొండకు చేరుకునేలా నాడు ఐదు కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో దారిని ఏర్పాటు చేశారు. ఈ కొండపైకి వెళ్లే మార్గంలో నాటి రాజసం, వారి శిల్పాకళాకృతులు నేటికీ సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. శ్రీవారిపై అచెంచలమైన భక్తితో రాయలవారు రెండవ రాజధాని అయిన చంద్రగిరిలో అనేక కట్టడాలు నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది.రాయల వారు తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ బస చేసేవారట.

దుర్గం కొండపైకి చేరుకోగానే మనకు కనిపించేది శత్రువుల జాడ కోసం సైనికులు కాపాలాకాసేందుకు ఏర్పాటు చేసిన ఎత్తైన మండపం. అన్ని వేళల్లో ఇక్కడి నుంచే రాజ్యాన్ని పరిరక్షించేవారు. వర్షాకాలంలోనూ విడిది చేసేందుకు మండపం కింద భటులు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు..అలా పైకి చేరుకోగానే కోనేరు దర్శనమిస్తుంది.అక్కడ కేవలం వర్షపు నీరుతో ఏర్పడింది.రాయలవారి సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు దుర్గం కొండపై నిత్యం భటులు షిఫ్ట్‌ల పద్ధతిలో విధులు నిర్వహించే వారు. వీరి విడిది కోసం రాయలవారు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు. కొండపై మట్టి, రాళ్లు లభించకపోయినప్పటికీ ఇంత పెద్ద మండపాలను ఎలా నిర్మించారో అన్న సందేహం కలగకమానదు..
చంద్రగిరి కోటలోకి ప్రవేశించే మార్గంలో కుడివైపున మనకు పెద్ద బండరాయి కనిపిస్తుంది. దానిపై ఉరికొయ్యిని రాయలవారు ఏర్పాటు చేశారు. తీవ్రవాదులు, ముష్కరులు, నేరస్థులను రాజ్యంలోని ప్రజలందరి ముందు ఆ బండపై ఉన్న ఉరికొయ్యిపై ఉరితీసేవారు. అయితే కొంత మంది వాటిని గంటా మండపంగా పిలుస్తుంటారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టి గంట మోగిస్తారు. అ శబ్దం విన్న తర్వాత బండపై గంట మోగించడం ద్వారా రాయలవారు భోజనం చేసేవారని చంద్రగిరి ప్రజలు ఇప్పటికీ చెపుకుంటారు.

దుర్గం కొండకు పడమటి భాగంలో ఉప్పుసట్టి-పప్పుసట్టి ఉంది. ఇక్కడ ఒక బండలో నుంచి ఊటవస్తూ ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత నాలుగు ఇంచుల మందంతో ఒక చిన్న గోడ కనిపిస్తుంది. గోడకు ఇటువైపు ఉండేది పప్పు సట్టిగాను, అటువైపు ఉండేది ఉప్పు సట్టిగాను పిలుస్తుంటారు. పప్పుసట్టిలోని నీళ్లు తియ్యగా, ఉప్పు సట్టిలోని నీళ్లు ఉప్పగా ఉంటాయి.ఇవే కాకుండా సైనికులు భోజనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు..కోనేటి నుంచి కాసింత దూరం నడుచుకుంటూ వేళ్తే మనకు అక్కగార్ల దేవతలు, నాగాలమ్మ విగ్రహాలు కనిపిస్తాయి. నాగాలమ్మ ఆలయం వద్ద ఉన్న నీటిలో కర్పూరం వెలిగితే, అది రగులుతూ లోపలకి వెళ్లడం అక్కడి అమ్మవారి శక్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది..భటులు విశ్రాంతి కోసం ప్రత్యేక గ్రుహాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.ఇవన్నీ కూడా చంద్రగిరి కోటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి..ఆనాటి చరిత్రకు దర్పణంగా నిలిచాయి.నాటి
విజయనగర రాజుల వైభవాన్ని తెలియజేస్తున్నాయి.ఆధునిక యుగానికి స్పూర్తిగా నిలిచాయి.అంతేకాక ప్రస్తుతం చంద్రగిరి కోట పర్యాటకులను ఆకర్షిస్తోంది. గొప్ప పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :