ఉదయం రోడ్డెక్కితే కానీ పూట గడవని పరిస్థితి వారిది. ఎండైనా, వానైనా రహదారుల పక్కన వ్యాపారాలు చేసుకోకుండా కుటుంబాలను పోషించుకోలేని దుస్థితి. ప్రభుత్వ ఉద్యోగాలు రాక, ఉపాధి కరువై సొంతకాళ్లపై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు అధికారులు తీసుకున్న చర్యలు శాపంగా మారుతున్నాయి
అల్లూరి జిల్లా కేంద్రంలో చిన్న చిన్న దుకాణాలు ఫుట్ పాత్ లపై వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు సుమారు 100 వరకు ఉన్నాయని ఓ అంచనా.పాడేరు నడిబొడ్డున రద్దీగా ఉండడంతో ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్లలో పూలు, పండ్లు సహా చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ వీరంతా జీవనం సాగిస్తున్నారు. తోపుడు బండ్లు, చిన్న చిన్న రేకులు షెడ్ లు వేసుకుని ఎవరికీ ఇబ్బంది లేకుండా వీరంతా ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక్కో దుకాణాల వద్ద సరాసరిన ముగ్గురు పని చేస్తున్నారు, జీవనం సాగించే దుకాణాలను, తోపుడు బండ్లను పంచాయతీ అధికారులు తొలగిస్తున్నారు. కనీసం ఏమాత్రం సమయం ఇవ్వటం లేదు. రోడ్డుపై పెట్టుకుందామంటే పోలీసులు ఒప్పుకోవటం లేదు. దీంతో వ్యాపారాలు ఎక్కడ చేసుకోవాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.