- తాళపత్ర గ్రంథాలను పరిరక్షిస్తున్న ఎస్వీయూ.
తిరుపతి, మే-26: “తాళపత్రాలు.”. చరిత్రకు మూలాధారాలు. అటువంటి వాటిని పరిరక్షిస్తూ.., పరిశోధనల ద్వారా.., అందులోని జ్ఞానాన్ని ఆధునిక సమాజానికి అందిస్తోంది ఎస్వీయూలోని ప్రాచ్య పరిశోధనా సంస్థ..ORI సంస్థ చేస్తున్న రీసెర్చ్ పై ప్రత్యేక కథనం.
ప్రాచీన నాగరికతను, అలనాటి వైభవాన్ని ఆధునిక సమాజానికి తెలియజేస్తూ.., మానవ మనుగడకు బాటలు వేసేవి “తాళపత్రగ్రంథాలు”. చారిత్రక నేపథ్యాన్ని తెలియజేసే తాళపత్రాలను పరిరక్షించడంతో పాటు, వాటి సారాన్ని నవీన మానవునికి అందిస్తోంది తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాశ్చ్య పరిశోధనా సంస్థ. 1956 నవంబర్ 1వ తేదీన ORI సంస్థను ఉన్నత ఆశయంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో స్థాపించారు. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ మైందిగా ప్రాచ్య పరిశోధన సంస్థ ఖ్యాతి గడిచింది. ఈ సంస్థలో రామాయణం, మహాభారతం, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు , ఆయుర్వేదం, ఆస్ట్రాలజీ, వాస్తు, వ్యాకరణం, ఆర్థిక శాస్త్రం మొదలైన 20 వేల తాళపత్ర గ్రంథాలు, 40 వేల కృతులు, 50 వేల పై చిలుకు ఇతర గ్రంథాలకు సంబంధించిన 500ఏళ్ళ నాటి తాళపత్రాలున్నాయి. ఇందులో సంస్కృతం, నందినాగరి, శారద, కరోష్టి , తెలుగు, తమిళం, కన్నడ భాషలను తెలిపే లిపుల తాళ పత్రగ్రంథాలు ORI సంస్థలో ఉన్నాయి. వీటిని అటు ప్రభుత్వం, ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం సేకరించి అందిస్తే.. మిగిలిన గ్రంథాలను ప్రాచ్య పరిశోధనా సంస్థ స్వయంగా సమీకరించి ఇందులో భద్రపరిచింది.
ఇప్పటివరకు 200 గ్రంథాలపై పరిశోధనలు జరిపిన ఆ సంస్థ పండితులు, అధ్యాపకులు, పరిశోధకులు.., అందులోని జ్ఞానాన్ని పుస్తకరూపంలో ఆధునిక సమాజానికి తెలియజేశారు .. వంద మంది విద్యార్థులకు ఓ ఆర్ ఐ పట్టభద్రులుగా గుర్తిస్తూ.., డిగ్రీలు ప్రదానం చేసింది ఎస్వీయూనివర్శిటి. మహిమాన్వితమైన ఈ గ్రంథాల పరిరక్షణకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ప్రాశ్చ్య పరిశోధనా సంస్థకు కావలసిన నిధులను అందిస్తూ సంస్థ పురోభివృద్ధికి బాటలు వేస్తోంది. వందల ఏళ్లనాటి చరిత్రను ప్రాచ్య పరిశోధన సంస్థ ద్వారా పరిశోధనలు నిర్వహిస్తూ.., తాళపత్రాలలోని విజ్ఞానాన్ని భావితరాలకు అందిస్తోంది ఆధునిక సమాజ అభ్యున్నతికి పాటుపడుతోంది.