హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీపై కేసులో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, డింపుల్ తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. డింపుల్ హయతిపై తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. డింపుల్.. డీసీపీ కారు కవర్ తీసేసిందని ఎఫ్ఐఆర్ లో రాశారని, నిజంగా డింపుల్ తొలగించినట్టు ఫుటేజ్ ఉంటే బయటపెట్టండని సవాల్ విసిరారు ఆమె తరుపు న్యాయవాది పాల్ సత్య నారాయణ. ఈ వివాదంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
డీసీపీ అబద్దాలు చెబుతున్నారరన్నారు పాల్ సత్యనారాయణ. తన డ్రైవర్‌ను కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నాడని.. ఇంత జరుగుతున్నా డ్రైవర్ ఎందుకు బయటకు రావడంలేదని ప్రశ్నించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్స్, ట్రాఫిక్ పోలీసులు కావాలనే బ్రిక్స్ తీసుకొచ్చి పార్కింగ్‌లో పెట్టారని.. చేసిన తప్పును కవర్ చేసుకునేందుకే ఇదంతా చేశారని న్యాయవాది పాల్ ఆరోపించారు.
డీసీపీ ప్రవర్తన బాగాలేకనే డింపుల్ గతంలో ఆయనకు వార్నిం కూడా ఇచ్చిందని.. ఆ కోపంతోనే డింపుల్‌పై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు లాయర్ సత్య నారాయణ. ఇక డింపుల్ ఇంట్లోకి కూడా ఎవరెవరో వస్తున్నారని, తెలియని నంబర్స్ నుంచి కాల్స్ చేసి ఆమెను భయపెడుతున్నారని.. భయంతో ఆమె బయటకు కూడా రావడంలేదని చెప్పుకోచ్చారు. దీనిపై డింపుల్ ఫిర్యాదు చేస్తే కూడా తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు.
ఒక ఐపీఎస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమేనన్న పాల్ సత్యనారాయణ.. డీసీపీతో పాటు అతని డ్రైవర్ పైన న్యాయ పరమైన యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. కాగా, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే, డింపుల్ హయతికి మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. డీసీపీ డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్‌పై కేసు కూడా నమోదైంది. డింపుల్ హయతి నివాసం ఉంటున్న భవనంలోనే ట్రాఫిక్ డీసీపీ ఐపీఎస్ రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. మరోవైపు, డింపుల్ కూడా డీసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.