ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం తన బడ్జెట్‌లో రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ బుందేల్‌ఖండ్ ప్రాంత తాగు, సాగునీటి వసతిని కల్పించే కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియకు అత్యం త ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర ఆమోదం లభించిన ఈ నదుల అనుసంధానానికి 2002–23 వార్షిక బడ్జెట్‌లో రూ.1,400 కోట్ల కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించింది.
మంగళవారం లోక్‌సభలో తన బడ్జెట్ ప్రసంగంలో నదుల అనుసంధాన ప్రక్రియను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘రూ.44,605 కోట్ల అంచనా వ్యయంతో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాం. దీని ద్వారా 9.05 లక్షల హెక్టార్ల రైతుల భూములకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 103 మెగావాట్ల హైడ్రో, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది.
దీనికై 2022–23లో రూ.1,400 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించాం’అని పేర్కొన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి నీటి కొరత ఎదుర్కొంటున్న బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరనుంది.