కరీంనగర్ జిల్లా: శాసనసభ మాజీ సభ్యుడు,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి మృతిపై టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు వంచ శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తకోట మృతితో పార్టీకి తీరని నష్టమని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో కొత్తకోట దయాకర్ రెడ్డి నిబద్ధత కలిగిన రాజకీయ
నాయకుడని, ఆయన పార్టీకి అందించిన సేవలు చిరస్మరణీయమని శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. మహబూబ్ నగర్ జిల్లా అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1994, 1999లో ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు, 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి ఒక మారు ఎమ్మెల్యేగా ఆయా నియోజక వర్గాల అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి దయాకర్ రెడ్డి నిరంతరం పాటుపడ్డారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా దయాకర్ రెడ్డి సతీమణి సీతాదయాకర్ రెడ్డి కూడా 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా,అంతకు ముందు 2002లో జడ్పీ చైర్పర్సన్ గా పని చేశారని, కొత్తకోట దంపతులు తెలుగుదేశం పార్టీ అందించిన సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి కొత్తకోట దంపతులు వీర విధేయులు కావడం వల్లనే వారు కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ వేరే పార్టీలో చేరలేదని వంచ శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.కొత్తకోట మృతితో తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. దయాకర్ రెడ్డి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ
సానుభూతి,సంతాపం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాతో ‘కొత్తకోట’ కు అనుబంధం:దామెర కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కొత్తకోట దయాకర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి దయాకర్ రెడ్డి పరిశీలకునిగా పని చేశారని ఆయన గుర్తు చేశారు. దయాకర్ రెడ్డి పార్టీకి అందించిన సేవలు ప్రశంసనీయమని సత్యం కొనియాడుతూ ఆయన మృతికి సంతాపతం ప్రకటించారు.