- బారీగా ఆస్థినష్టం
- గోవిందరాజస్వామి వారి రథానికి ప్రమాదం జరగలేదు- టీటీడీ ఈవో ధర్మారెడ్డి
- అగ్ని ప్రమాదం పై దుష్ప్రచారాన్ని మానుకోవాలి..ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి.
తిరుపతి, జూన్-16: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ ఫొటో ఫ్రేమ్ వర్క్ షాప్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే, రద్దీగా ఉండే ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న పలువురు భయంతో పరుగులు తీశారు. ఇరుకుగా ఉండే ప్రాంతం కావడంతో.. సహాయక చర్యలకు కూడా ఇబ్బంది కలిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది. కాగా ఈ అగ్ని ప్రమాదంలో బారీగానే ఆస్థినష్టం జరిగింది. ఇకపోతే… అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంలో గోవిందరాజస్వామి వారి రథానికి ఏ ప్రమాదం జరగలేదని తెలిపారు. అగ్ని ప్రమాద స్థలానికి దూరంలోనే రథం ఉందని చెప్పారు. రథానికి ఎలాంటి మంటలు అంటుకోలేదని.. ముందు జాగ్రత్తగా కాస్త వెనక్కి లాగి పెట్టామని తెలిపారు. అగ్ని ప్రమాదంలో గోవిందరాజస్వామివారి రథం దెబ్బతిన్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు.
ఇక, ప్రమాద స్థలంపై స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ.. మంటల్లో చలికాచుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గోవిందరాజస్వామి ఆలయ రథం కాలిపోయిందని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అగ్ని ప్రమాద ఘటనపై టీడీపీ దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు.