తిరుపతి : ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని… ఇకపై పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లు మరింత దూకుడు పెంచాలని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రామచంద్రాపురం మండలం, పి.వి.పురం పంచాయితీలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులివర్తి సుధారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న 9 నెలల కాలం పార్టీకి అత్యంత కీలకమని, అలసత్వం వీడి పక్కా ప్రణాళికతో పని చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నాయకుల పనితీరుపై ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయా నాయకులకు దిశానిర్దేశం చేశారు. నాలుగేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని, ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిన అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.