పల్నాడు జిల్లా పిడుగురాళ్ల : పిడుగురాళ్ల పట్నంలోని సున్నం బట్టిల దగ్గర శ్రీజ కెమికల్ ఇండస్ట్రీ లో పడి బట్టి కార్మికుడు దుర్మరణం చెందాడు. వివరాలు ప్రకారం పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన రామిశెట్టి పెద్ద వీరయ్య కుమారుడు రామిశెట్టి చిన్న బ్రహ్మయ్య (37) సున్నబట్టీలు పనికి వెళ్లి సున్నం రాయిని బట్టిలో వేసి కూర్చుండగా ప్రమాదవశత్తు లోపల పడిపోయి చనిపోయాడు. మృతదేహం ఆనవాళ్లు కూడా కనిపించకుండా సున్నపురాయితో కలిసి కాలిపోయి బూడిదగా మిగిలిపోయిందని బట్టి కార్మికులు వివరించారు. కొన్ని వందల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద సున్నపురాయిని కాల్చి సున్నం తయారు చేస్తూ ఉంటారు ఇంత ఉష్ణోగ్రతలో పడినవారు వెంటనే ఖాళీ బూడిదైపోతూ ఉంటారు ఎముకలు కూడా దొరకవు. మృతుడు బ్రహ్మయ్యకు భార్య వెంకటరమణ, నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. బట్టిలో పడి కార్మికుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బట్టీ కార్మికులు దుఃఖసాగరంతో మునిగిపోయారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదం గురించి దర్యాప్తు చేస్తున్నారు. సున్నపు బట్టీలలో పని చేస్తున్న కార్మికుల భద్రతా విషయంలో యాజమాన్యం సరైన భద్రత చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కార్మికుల భద్రత విషయంలో సున్నపు బట్టీలు ఎటువంటి చర్యలు తీసుకున్నాయి దర్యాప్తు జరిపి సరైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతుంది.