- వలసల గురువు గ్రామానికి త్రాగు నీటి సదుపాయం కల్పించాలి
- నీడ్స్ సంస్థ రాష్ట్ర కన్వీనర్ అర్.లక్ష్మణ్ డిమాండ్
అల్లూరి జిల్లా, అనంతగిరి, (ది రిపోర్టర్) :అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, జీనబాడు పంచాయతీ పరిధిలో గల వలసల గురువు గిరిజన గ్రామానికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని జై భారత్ ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు,నవీన చైతన్య సాధికారిత అభివృద్ధి సమితి (నీడ్స్ )రాష్ట్ర కన్వీనర్ రేగం లక్ష్మణ్ డిమాండ్ చేశారు,ఈ సందర్బంగా బుధవారం అయన వలసల గురువు గ్రామంలో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను స్థానిక గిరిజన మహిళలను అడిగి తెలుసు కున్నారు,అనంతరం అయన మాట్లాడుతూ…వలసల గురువు గ్రామంలో 15 గిరిజన కుటుంబాలు వారు ఒక వైపు దట్టమైన కొండలు మరో వైపు రైవాడ జలాశయం నడుమ నివాసం వుంటున్నాయని అన్నారు,గ్రామంలో ఇప్పటికి గత, ప్రస్తుత ప్రభుత్వం ఒక్క చేతి బోరు కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు,ఒక చిన్న నుయ్యి ఉన్నప్పటికి వేసవి కాలం కావడంతో అదికూడా అడుగంటింది,త్రాగు నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలు ఊట నీరు కూడా ఈ వేసవి వేడికి అడగంటి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు, ఊట నీరు రాకపోతే పక్కనే ఉన్న రైవాడ జలాశయ కలుషితమైన నీటినే గ్రామస్తులు సేవించే పరిస్థితి ఉందన్నారు, స్థానిక నాయకులకు, అధికారులకు ఈ సమస్య కనిపించలేదా అని ప్రశ్నించారు,ఇకనైనా ప్రజా ప్రతినిధులు ,అల్లూరి జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడిఎ ఉన్నత అధికారులు స్పందించి వలసల గురువు గ్రామానికి రక్షిత త్రాగు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు, లేనిచో గ్రామస్తులతో కలిసి జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జి.గణేష్,టీ కొండబాబు, ఎస్.భీమన్న,జీ. వరలక్ష్మి, టి.సన్యాసమ్మ,ఎస్.చంద్రమ్మ, మహిళలు పాల్గొన్నారు.