ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణంలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలో విద్యనభ్యసించే బాలికలకు రక్షణగా ఉండాల్సిన ఓ మహిళా సెక్యూరిటీ గార్డు.. ఓ బాలికపై లైంగిక దాడికి సహకరించిందన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఉరవకొండ పట్టణంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిపై లైంగిక దాడి చేశారంటూ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలికపై అత్యాచారం చేశారని.. ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేయడం స్థానికంగా కలకలం రేపింది. వేసవి సెలవులకు ముందు గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికపై పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న జానకి అనే మహిళ బాలికకు జ్యూస్ లో మత్తు మందు కలిపి ఇచ్చింది.. ఆ తర్వాత స్పృహ కోల్పోయింది. అనంతరం జానకి సహాయంతో అటెండర్ రామాంజినేయులు, బయటి నుంచి వచ్చిన మరో వ్యక్తి పాఠశాలలో ఉన్న గదిలోకి తీసుకెళ్లి నోటిలో గుడ్డలు కుక్కి లైంగిక దాడి పాల్పడ్డారని బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు రామాంజనేయులు గత సంవత్సరమే ఆ పాఠశాల నుండి బదిలీ అయ్యి మరో ఊరికి వెళ్ళినా.. మహిళా సెక్యూరిటీ గార్డ్ సహకారంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఫిర్యాదు అనంతరం బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పాఠశాలలు తిరిగి ప్రారంభమైనా బాలిక పాఠశాలకు వెళ్లకపోవడంతో ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించామనపతాకగ. తమకు అనుమానం వచ్చి.. బాలికను నిలదీయగా తాను పాఠశాలకు వెళ్లనని ఏడుస్తూ జరిగిన ఈ దారుణాన్ని తమకు వివరించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా మగవారిని చూస్తే భయపడుతూ ఉండడం, ఒంటరిగా ఉండడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, నిత్యం మానసికంగా బాధపడుతూ ఉండటంతో బాలిక ఆరోగ్యం గురించి వైద్యులను ఆశ్రయించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి జరిగిన దారుణాన్ని తమకు వివరించడంతో పోలీసులను ఆశ్రయించామని.. ఈ దారుణంలో పాలుపంచుకున్న మహిళా సెక్యూరిటీ గార్డు, అటెండర్ రామాంజనేయులు, బయట నుంచి వచ్చిన మరో వ్యక్తి ముగ్గురిపై ఫిర్యాదు చేశామని.. తమకు న్యాయం చేయాలని బాలిక కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా గురుకుల పాఠశాలకు వెళ్లి ప్రాథమిక విచారణ చేపట్టారు. నిందితుడు రామాంజనేయులు, మహిళా సెక్యూరిటీ గార్డు జానకి మరో వ్యక్తిపై 376(2), 376DA ,120b, 324 ఐపిసి 5 (1)6 పోస్కో ACT 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.