హైదరాబాద్ – మధురానగర్ : ఇప్పటివరకు ప్రజలకు ల్యాండ్ మాఫియా , మైనింగ్ మాఫియా, ఇంకో మాఫియా గురించి మాత్రమే తెలుసు. రాజకీయ నాయకులకు ఆదాయాన్ని ఇచ్చే చెత్త మాఫియా వెలుగులోకి వచ్చింది. మధురానగర్ లో చెత్తను అమ్మేవారు, చెత్తను కొనేవారున్నారంటే నమ్ముతారా ? . ప్రజలు ఆదాయపు పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను ప్రభుత్వానికి కట్టడం చూసాం. కానీ ఇప్పుడు మధురానగర్ సంక్షేమ సంఘం వారికి చెత్త పన్ను చెల్లించాలి. పన్ను కట్టకపోతే చెత్త తీయరు. ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా వ్యవహరిస్తున్న మధురానగర్ సంక్షేమ సంఘం సిబ్బంది. కొందరు స్థానికులు ఇప్పటికే ఇంటి పన్ను , నీటి పన్ను ఆదాయపు పన్ను కడుతున్నామని కొత్తగా ఈ దళారి వ్యవస్థ ఎక్కడినుండి వచ్చిందని, ప్రయివేట్ వ్యక్తులు వసూళ్ళకు పాలుపడడం ఏంటని వాపోతున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ కు సుమారు వెయ్యి రూపాయల వరకు వసూల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మున్సిపాలిటి అధికారులకు చెప్తే పట్టించుకోకుండా చెత్త మాఫియా గాళ్ళకు చెప్తే వారు బెదిరింపులకు పాలుపడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఇంత పెద్ద వసూళ్ళ దందా జరుగుతున్నట్టు సమాచారం. మధురానగర్ వెల్ఫేర్ సొసైటీ లో నివాసముంటున్న వారి దగ్గర డబ్బులు ఎందుకు వసూల్ చేస్తున్నారు ? ఎవరికోసం వసూల్ చేస్తున్నారు ? వసూల్ చేసిన డబ్బులో ఎవరి వాటా ఎంత ? నిగ్గుతేల్చాల్సిన అవసరముంది. మధురానగర్ సంక్షేమ సంఘం ఆగడాలు ఎక్కువవుతున్నాయని, మధురానగర్ కమ్యూనిటీ హాల్ పై వచ్చే డబ్బును సంఘం ఏమి చేస్తుందో తెలుపాలని కొందరు స్థానికులు డిమాండ్ చేసారు. ఇకనైన ఉన్నతాధికారులు పూర్తి దర్యాప్తు చేసి మధురానగర్ సంక్షేమ సంఘం పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.