ప్రకాశం జిల్లా: వివాహిత పట్ల గ్రామ సచివాలయ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో రివాల్వర్‌తో బెదిరింపులకుదిగి.. ఆమె ఇంటి వద్ద హల్చల్ చేశాడు. దీంతో గ్రామస్థులు అతన్ని పట్టుకుని బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ షాకింగ్ ఘటన ప్రకాశం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొమరోలు ఎస్ఐ ఎ.సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికోద్యోగి పాలుగుళ్ల మోహన్‌రెడ్డి పదవీవిరమణ పొందాడు. ప్రస్తుతం రాజుపాలెం సచివాలయంలో పశు సంవర్ధక సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వివాహిత తన భర్తతో విభేదాలు కారణంగా గత కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. దీంతో మోహన్‌రెడ్డి ఆమెతో పరిచయం పెంచుకుని చనువుగా ఉండేవాడు. ఐతే ఇటీవల భార్యభర్తలిరువురూ కలిసి పోయారు. దీంతో ఆమె మోహన్‌రెడ్డితో మాట్లాడటం తగ్గించింది. దీంతో వివాహిత ఫోన్ కు అసభ్యకర మెసేజ్‌లు చేయడంతో ఆమె కుటుంబసభ్యులు దీనిపై మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
కక్ష పెంచుకున్న మోహన్‌రెడ్డి తన లైసెన్స్ రివాల్వర్‌తో బుధవారం అర్ధరాత్రి వివాహిత ఇంటి వద్దకు వెళ్లి హల్చల్ చేశాడు. గ్రామస్థులు అతడ్ని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.