అల్లూరి జిల్లా : ఇంటికి చేరుకుంటున్నాను అనుకుంటున్న ఆ గిరిజనుడ్ని క్వారీ లారీ రూపంలో మృత్యువు కబళించింది. హుకుంపేట మండలం తాడిపుట్టు జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రేగం నారాయణరాజు(32) అనే గిరిజనుడు మృతి చెందాడు. హుకుంపేట నుంచి నిమ్మలపాడు వెళ్తున్న ఆటోను కోట్నపల్లి క్వారీ నుంచి పాడేరు వెళ్తున్న లారీ ఆటో ను బలంగా డీ కొట్టడం తో ఆటో డ్రైవర్ రేగం నారాయణరాజు అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, లారీలో ఉన్నవారు ఘటనా స్థలం నుండి పరార్ అయ్యారు. మృతుని బంధువుల ఆర్తనాదాలతో పరిసరాలు ఉద్విగ్నంగా మారాయి. హుకుంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.