- తంగళ్ళపల్లి మండలం మండపల్లి ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమంలోని “పండుటాకుల”కు కలెక్టర్ ఆత్మీయ పలకరింపు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: సౌలత్ లు బాగున్నాయా..? భోజనం ఎట్లా ఉంది…? అన్ని వసతులు సక్రమంగా కల్పిస్తున్నారా లేదా అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా తీశారు. మంగళవారం తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, వృద్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్కడున్న వయోవృద్ధులతో ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. భోజనం ఎలా ఉంది? వారానికి ఎన్ని సార్లు నాన్ వెజ్ పెడుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. వారి ఫిజికల్ యాక్టివిటీస్ ని మెరుగుపరచాలని నిర్వాహకులకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అలాగే ప్రతి వారం క్రమం తప్పకుండా వైద్యాధికారితో పరీక్షలు చేయించాలని అన్నారు. ఇంకా ఎలాంటి వసతులు కావాలి.. ఏవైనా సమస్యలు ఉన్నాయా? వృద్ధులకు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.అలాగే బాలసదనం నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయాలని జిల్లా సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, ఉప తహశీల్దార్ దివ్య, తదితరులు ఉన్నారు.