- కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి
- వారణాసిలో పూర్ణాహుతితో ముగిసిన శ్రీనివాస చతుర్వేద హవనం
తిరుమల : రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి ఇతిహాసాల పారాయణం వల్ల సమాజంలో ధార్మిక విలువలు పెంపొందుతాయని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , ఈవో ఏవీ ధర్మారెడ్డిలను అభినందిస్తున్నానని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇతిహాసాలు మానవ జాతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి శాశ్వత మార్గదర్శకాలన్నారు. టీటీడీ నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులు, దేవాలయాల నిర్మాణాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను స్వామీజీ ప్రత్యేకంగా అభినందించారు.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు వారణాసిలో జరిగిన శ్రీనివాస చతుర్వేద హవనం గురువారం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. కంచి కామకోట అధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శీస్సులతో లోక కల్యాణం కోసం 8 రోజుల పాటు ఈ చతుర్వేద హవనం నిర్వహించారు. 8 రోజుల పాటు ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు వేద హవనం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ ఆధ్వర్యంలో శ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.