- 45 నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే గడ్డి తిని జీవిస్తారా?
- గ్రామపంచాయతీ కార్మికుల ధర్నాలో సిఐటియు ప్రధాన కార్యదర్శి కందారపు మురళి
తిరుపతి : సత్యవేడు గ్రామపంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లకు 45 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వీరు గడ్డి తిని జీవిస్తారా? ఎలా బతకాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా విమర్శించారు.
పంచాయతీ కార్మికులకు రెండు నెలల నుంచి 45 నెలల వరకు వేతనాలు ఇవ్వకుండా వేధించడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట శుక్రవారం నాడు ధర్నాలు జరిగాయి.
తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నానుద్దేశించి కందారపు మురళి ప్రసంగించారు. కనిష్టంగా రెండు నెలల నుంచి గరిష్టంగా 45 నెలల వరకు పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నదని, ఇప్పటికే పంచాయతీ కార్మికులు రాష్ట్రంలో 175 మంది తీవ్ర దారిద్ర్యం తో మరణించారని కందారపు మురళి ఆరోపించారు. పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు అమానుషంగా ఉందని, ఎన్నికలకు ముందు కాంట్రాక్టు అనే పదమే లేకుండా చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి కార్మికుల దయనీయస్థితికి కారకుడయ్యారని విమర్శించారు. గ్రీన్ అంబాసిడర్ అనే పేరు పెట్టి వారి జీవితాల్లో పచ్చదనం లేకుండా చేశారని, పేరు గొప్ప ఊరు దిబ్బలా గ్రీన్ అంబాసిడర్ల వ్యవస్థ తయారయిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని చెప్పి కనీస వేతనం 6 వేలకు మించడం లేదని, నెలకు 6వేల రూపాయలు ఒక కుటుంబానికి సరిపోతాయా? అని ప్రశ్నించారు.. ఇవ్వాల్సిన ఆ ఆరువేలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని మురళి అన్నారు 680 జీఓ ప్రకారం వేతనాలను అమలు పరచాలని డిమాండ్ చేశారు.
సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సమ్మెకు పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం ప్రసంగిస్తూ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నదని గ్రామాలలో తలెత్తుకోలేని పరిస్థితిని సర్పంచులకు సృష్టించిందని, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. పంచాయతీ కో విధానం పెట్టి వ్యవస్థను అవహేళన చేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వ తీరును బాలసుబ్రమణ్యం తప్పుపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాము అధ్యక్షత వహించగా పంచాయతీ యూనియన్ నాయకులు నాగభూషణం, వెంగమ్మ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు…
డిఆర్ఓ కు వినతి పత్రం
పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని కోరుతూ డిఆర్ఓ కోదండరామిరెడ్డికి పంచాయతీ యూనియన్ నేతలు, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. బాలసుబ్రమణ్యం కందారపు మురళి లతో కూడిన ప్రతినిధి బృందం డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించింది. కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని వీఆర్వో కోదండరామిరెడ్డి ప్రతినిధి బృందానికి వివరించారు.