- పల్నాడు జిల్లాలో లోకేశ్ యువగళం
- మాచర్ల నియోజకవర్గంలో పాదయాత్ర
- ఈ సాయంత్రం కారంపూడిలో లోకేశ్ బహిరంగ సభ
- జనసంద్రంలా మారిన వీర్లగుడి సెంటర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మాచర్ల నియోజకవర్గంలో కొనసాగుతోంది. కారంపూడిలో ఈ సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. కారంపూడిలోని వీర్లగుడి సెంటర్ లోకేశ్ రాకతో జనసంద్రాన్ని తలపించింది. తన ప్రసంగంలో… పుంగనూరు ఘటనల నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిపై లోకేశ్ నిప్పులు చెరిగారు.
లోకేశ్ ప్రసంగం హైలైట్స్…
రిషాంత్ రెడ్డీ… నువ్వు ఐపీఎస్ కు అన్ ఫిట్
చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త. ప్రతిపక్ష నేతపై వైసీపీ వాళ్లు చేసిన రాళ్ల దాడి ఆయనకి కనపడలేదంట. రిషాంత్ రెడ్డీ… ఇంకో 9 నెలలు ఓపిక పట్టు… నీ కళ్లకు ఆపరేషన్ చేయించి అన్నీ కనిపించేలా చేస్తాం.
రిషాంత్ రెడ్డీ… నువ్వు ఐపీఎస్ కు అన్ ఫిట్. నువ్వు ఐపీఎస్ కాదు… పీపీఎస్( పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్). నీకు అంత సరదాగా ఉంటే పోలీస్ డ్రెస్ తీసి బులుగు డ్రెస్ కప్పుకో. చంద్రబాబు గారు నీళ్లు పారిస్తా అంటుంటే జగన్ రక్తం పారిస్తా అంటున్నాడు. నీళ్లు కావాలో? లేక రక్తం కావాలో రాష్ట్ర ప్రజలు ఒక్క సారి ఆలోచించండి.
ఇంతకంటే వింత ఎక్కడైనా ఉంటుందా!
రాష్ట్ర చరిత్ర లో ఎప్పుడూ జరగని ఒక వింత జరిగింది… అది ఏంటో తెలుసా?…. అధికారంలో ఉన్న పార్టీనే బంద్ కి పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ బస్సులు, అమర్ రాజా కంపెనీ బస్సులు ధ్వంసం చేయడం, ఉద్యోగస్తులపై దాడి చెయ్యడం వంటి పనులన్నీ అధికారపక్షం వాళ్లే చేశారు.
దీని అర్ధం ఏంటి? జగన్ పనైపోయింది. అందుకే బంద్ కి పిలుపునిచ్చాడు. ఈ ఒక్క సంఘటన చాలు జగన్ ఎంత చేతగానివాడో, ఎంత అసమర్ధుడో చెప్పడానికి. ఒక్క ప్రాజెక్టు కట్టడం రాని జగన్ ప్రతిపక్ష నేత మీద దాడి చేయించాడు.
సీబీఎన్ అంటే హైఓల్టేజ్… ముట్టుకుని చూడు మసైపోతావ్!
ప్యాలస్ పిల్లి మరోసారి మియాం అంది. సింహం బయటకి వస్తే పిల్లి భయపడింది. ప్యాలస్ పిల్లి గేటుకి తాడు కట్టి సింహాన్ని ఆపాలి అనుకున్నాడు. ఆగలేదు. పులివెందులలో పిల్ల వేషాలు వేస్తే మన వాళ్లు తరిమికొట్టారు.
పుంగనూరులో పాపాల పెద్దిరెడ్డి సైకో గ్యాంగ్ రెచ్చిపోతే మన వాళ్లు కరెంట్ షాక్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు (సీబీఎన్) అంటే హై వోల్టేజ్… ముట్టుకుంటే మాడిమసైపోతావ్!
పౌరుషాల గడ్డ అంటే పల్నాడే!
పల్నాడు పౌరుషాల గడ్డ అని, మాచర్ల మాస్ దెబ్బ అదిరిపోయిందని లోకేశ్ ఉత్సాహం వెలిబుచ్చారు. మంచితనం మాచర్ల ప్రజల బ్లడ్ లో ఉందని, కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలు విడిపోకూడదని అందరికీ ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పల్నాటి బ్రహ్మనాయుడు అని కీర్తించారు.
సామాన్య మహిళ నుండి మహాశక్తిగా ఎదిగి, పల్నాడు రాజ్యానికి మంత్రిగా పనిచేసిన వీర మహిళ నాగమ్మ అని అభివర్ణించారు.
సాగర్ ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన గొప్పవాళ్లు మాచర్ల ప్రజలు
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూముల్ని త్యాగం చేసిన గొప్ప మనస్సు మాచర్ల ప్రజలది. పల్నాటి పౌరుషాన్ని బ్రిటిష్ వాళ్లకి చూపించిన స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు జన్మించిన నేల మాచర్ల. ఎంతో ఘన చరిత్ర ఉన్న మాచర్ల గడ్డపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.