టమాటా ధర దిగి వస్తున్నది. ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.300, తెలుగు రాష్ర్టాల్లో రూ.200 టచ్ చేసిన కిలో టమాటా ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతున్నది. మరికొద్ది రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల టాక్. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాటా రావడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెప్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ నుంచి కూడా టమాటా అధికంగా వస్తున్నది. తాజాగా ఏపీలోని మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం మార్కెట్కు దాదాపు 400 టన్నుల టమాటా రావడంతో ధర మరింత పడిపోయింది. మొదటి రకం టమాటా కిలో రూ.30 నుంచి రూ.40 పలికింది. రెండో రకం టమాటా కిలో రూ.21 నుంచి రూ.28 వరకు పలికింది…!!