రజనీకాంత్ హీరోగా ఈ నెల 10వ తేదీన ‘జైలర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఏసియన్ సునీల్ – దిల్ రాజు కలిసి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. తమిళంలోనే కాదు .. తెలుగులోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
తొలిరోజునే ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్నటితో ఈ సినిమా 4 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 4 రోజులలో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 32 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో వచ్చిన అనువాద చిత్రాలలో, ఇంతవేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని చెబుతున్నారు.
దర్శకుడు నెల్సన్ .. రజనీకాంత్ ను చూపించిన విధానం .. ఆయన స్టైల్ కి తగిన విధంగా సన్నివేశాలను డిజైన్ చేయడం .. యాక్షన్ దృశ్యాల వెంట ప్రేక్షకులను పరిగెత్తిస్తూ వెళ్లి, ఎమోషన్స్ తో కూడిన ట్విస్ట్ ఇవ్వడం .. కుటుంబ క్షేమాన్ని మాత్రమే కాదు, సమాజ శ్రేయస్సును కూడా గుర్తుపెట్టుకోవాలనే సందేశాన్నివ్వడం వలన ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది.