అరుణాచల్ ప్రదేశ్, డోక్లామ్ పీఠభూమి తమ అంతర్భాగాలేనంటూ చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్ ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చైనా తాజా మ్యాప్ పట్ల మరో నాలుగు దేశాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంతో పాటు, పలు వివాదాస్పద భూభాగాలను కూడా చైనా తన మ్యాప్ లో పొందుపరచడం పట్ల మలేసియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాం దేశాలు ఆక్షేపిస్తున్నాయి. ఇది నిరాధారమైన మ్యాప్ అంటూ చైనాపై మండిపడ్డాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం చైనా కొత్త మ్యాప్ లో పేర్కొన్న అంశాలు చెల్లుబాటు కావని స్పష్టం చేశాయి. తన సార్వభౌమత్వాన్ని విస్తరించుకోవడం కోసం చైనా చేసే ప్రయత్నాలు 1982 ఐరాస ఒప్పందం ప్రకారం చెల్లవని ఫిలిప్పీన్స్ పేర్కొంది. చైనా ఏకపక్ష వాదనలను తాము తిరస్కరిస్తున్నట్టు మలేసియా వెల్లడించింది. చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్ ను తాము ఎంతమాత్రం ఆమోదించబోమని స్పష్టం చేసింది. చైనా చర్యలు పరాసెల్, స్ప్రాట్లీ దీవులపై తమ సార్వభౌమత్వాన్ని ఉల్లఘించేలా ఉన్నాయని వియత్నాం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, అభ్యంతరకరంగా ఉన్న చైనా మ్యాప్ ను చూపించారంటూ వియత్నాం గత జులైలో ‘బార్బీ’ సినిమాను కూడా నిషేధించింది. తైవాన్ సైతం చైనా తన మ్యాప్ లో పొందుపరిచిన వివాదాస్పద నైన్ డాష్ రేఖను, దక్షిణ చైనా సముద్రం అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తైవాన్ ఎంతమాత్రం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో అంతర్భాగం కాదని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెఫ్ లియూ స్పష్టం చేశారు. ఈ విమర్శలపై చైనా విదేశాంగ శాఖ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు. తమ దేశ మ్యాప్ ను మెరుగుపర్చడం ప్రతి ఏడాదీ జరిగే ప్రక్రియేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.