టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కాన్వాయ్ సిట్ కార్యాలయంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం చంద్రబాబు సిట్ కార్యాలయంలో ఉన్నారు. ఆయనను సీఐడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలున్నాయి.
అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. కాసేపట్లో ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబు రిమాండ్ పిటిషన్ పై వాదనలు ప్రారంభం కానున్నాయి.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన సిద్ధార్థ లూథ్రా తన బృందంతో కోర్టు సముదాయానికి చేరుకున్నారు.