- క్యాబినెట్ లో సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి సురేష్ .
- ఈ రోజు నుంచి బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశాలు.
గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన బిల్లులకు ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్.డబ్ల్యూ.ఎస్) ఆధ్వర్యంలో 2019 నుంచి గ్రామాల్లో ట్యాంకర్ ల ద్వారా తాగునీటి సరఫరా చేశారు. ఇందుకు గాను మొత్తం 236 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ప్రకాశం జిల్లాలో దాదాపు 130 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా బిల్లులు పొదిలి సబ్ డివిజన్ లో ఉన్నవి. ఈ విషయంపై పలుమార్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సీఎం దృష్టికి తీసుకెళ్లి బిల్లుల చెల్లింపుకోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈనెల 20వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా మంత్రి సురేష్ సీఎంతో ఈ విషయాన్ని ప్రస్తావించగా అధికారులు రెండు రోజుల్లో బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకుంటారని సీఎం హామీ ఇచ్చారు. చెప్పినమాట ప్రకారం సీఎం ఆదేశాలతో అధికారులు బిల్లుల చెల్లింపుకు చర్యలు చేపట్టారు. ఈరోజు నుంచి ఆన్లైన్ లో బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టర్ లు అందరు వారి బిల్లులు అప్లోడ్ చేయించుకోవాలని, ఆన్లైన్ లో అప్లోడ్ అయిన వాటికి చెల్లింపులు కూడా జరుగుతాయని మంత్రి సురేష్ తెలిపారు. బిల్లుల చెల్లింపుకు అంగీకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కాంట్రాక్టర్ లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.