contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణ రాష్ట్రంలో వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రజలు అందరికీ ఉచితంగా కరోనా వాక్సినేషన్ : సీఎం కేసీఆర్

 స్వంతంగా రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ, వాక్సినేషన్ అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకూ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మొత్తం రాష్ట్రంలో వున్న అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు-మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇంచార్జులను నియమించడం కూడా జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. 

వాక్సినేషన్ కార్యక్రమంతో పాటు, రెమిడిసివిర్‌ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్ కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందని, ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, పెద్ద ఎత్తున సానిటేషన్ చేపట్టుతుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్రజలను అధైర్య పడవద్దని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వుండవద్దని సీఎం కోరారు.  

పెద్ద ఎత్తున గుంపు-గుంపులుగా కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్టంగా చేస్తుందని కేసీఆర్ మరోమారు చెప్పారు. 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :