జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ బహిరంగసభలో ప్రసంగించారు. రాజకీయాల్లో పట్టువిడుపు ధోరణి చాలా ముఖ్యమని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పట్టువిడుపు ఉన్న వ్యక్తి అని, కానీ ఆయన కుమారుడు జగన్ లో ఆ గుణం లేదని అన్నారు. వైసీపీ నేతలు ఒక్క విషయం ఆలోచించాలి… జగన్ ఉన్నాడని మీరు తప్పు చేస్తే రేపు రక్షించాల్సిన వ్యక్తిని నేనే అని స్పష్టం చేశారు.
అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలని, అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి అని, జనం బాగుండాలంటే జగన్ పోవాలి అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. “ఇంకోసారి జగన్ వస్తే మనం పారిపోవాల్సిందే అనకండి. కృష్ణా నది ఈ నేలను విడిచి వెళుతుందా? మనం కూడా అలాగే ఉండాలి. మనం పారిపోవడం కాదు, జగన్ ను పంపించేద్దాం” అని పిలుపునిచ్చారు. జనసేన ప్రభుత్వంలో పనిచేద్దాం, పని చేయిద్దాం… సీఎం పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తాను, మరింత బలంగా నిలబడి పనిచేస్తాను అని ఉద్ఘాటించారు. స్వాతంత్ర్యం సమయంలో యువనేతలను తయారుచేయలేకపోయామని సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారని, అలాంటి పరిస్థితిని తాను రానివ్వబోనని, 2047 నాటికి బలమైన నేతలను తయారుచేయడమే తన లక్ష్యమని అన్నారు. నాదెండ్ల మనోహర్ లా గెలుపోటములకు అతీతంగా నిలిచి పోరాడే నాయకులకు జనసేన స్వాగతం పలుకుతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.