contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దర్శి లో కల్తీ పాల కలకలం

  • పాల‘కూట విషం
  • జిల్లాలో విచ్చల విడిగా కల్తీపాల తయారీ
  • యూరియా, పామాయిల్‌, అత్యంత ప్రమాదకరమైన రసాయనాల వినియోగం
  • లీటరు పాల నుంచి ఐదు లీటర్లు
  • ప్రజల ప్రాణాలతో చెలగాటం
  • దర్శి, అద్దంకి ప్రాంతాల్లో అధికం

 

అద్దంకి/దర్శి(ప్రకాశం): జిల్లాలో కల్తీపాల తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇది వ్యాపారంగా మారింది. అడ్డగోలుగా సంపాదించాలన్న అత్యాశతో కొందరు పాపాలభైరవులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన యూరియా, పామాయిల్‌, ఇతరత్రా పలు రసాయనాలతో కల్తీపాలు తయారు చేస్తున్నారు. వాటిని సాధారణ పాలలో కలిపి విక్రయించి కాలకూట విషం చిమ్ముతున్నారు. అసలుకు, కల్తీకి తేడా తెలుసుకోలేని విధంగా కనికట్టు చేస్తున్నారు.

అద్దంకి, దర్శి ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో ఇలా కల్తీపాలు తయారు చేస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీటిని కొందరు ప్రైవేటు డెయిరీలకు పోస్తుండగా, మరికొందరు నేరుగా ప్రజలకు విక్రయించి వారిని అనారోగ్యం‘పాలు’ చేస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా పొదిలి రోడ్ లో గల ఓ పశువుల ఫారం లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యాపారం పై విజిలెన్స్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో పాపాల గుట్టు రట్టయింది.

పాలు స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనం. అవి లేనిదే రోజు మొదలడం కష్టం. పసికందు నుంచి ప్రతి ఒక్కరూ రోజూ పాలు తీసుకుంటారు. కానీ ఆ పాలు విషపూరితమవుతున్నాయి. కొందరు కల్తీగాళ్లు రకరకాల పద్ధతుల్లో పాలను తయారు చేస్తున్నారు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని అనేక చోట్ల ఈ వ్యవహారం సాగుతున్నప్పటికీ అద్దంకి, దర్శి ప్రాంతాల్లోని అత్యధిక గ్రామాల్లో ఎక్కువ మంది దీన్ని వ్యాపారంగా మార్చుకొని విషం చిమ్ముతున్నారు.

అద్దంకి ప్రాంతంలోని పలు గ్రామాల్లో గతంలో కల్తీ పాల తయారీ విచ్చలవిడిగా సాగింది. అప్పట్లో అధికారులు దాడులు చేసి పలువురిని అరెస్టు చేయడంతో దీనికి కొంత మేర అడ్డుకట్ట పడింది. మళ్లీ కొన్ని గ్రామాల్లో పునఃప్రారంభమైంది. ఏల్చూరు, సజ్జాపురం, కొమ్మాలపాడు, కొప్పరం, అద్దంకి మండలంలోని కలవకూరు, శంకవరప్పాడు, మణికేశ్వరం, ధేనువకొండ గ్రామాలలో కల్తీ పాల తయారీ గతంలో ఉధృతంగా సాగగా పలు పాల శీతలీకరణ కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక యంత్రాల ద్వారా గుర్తించి ఆయా గ్రామాల నుంచి వచ్చే పాలను తిరస్కరించారు.

దీంతో కొన్ని గ్రామాల్లో కల్తీ పాల తయారీ విరమించుకోగా, మరికొన్ని చోట్ల యథావిధిగానే కొనసాగిస్తున్నారు. పలు పాల శీతలీకరణ కేంద్రాల నిర్వాహకులు కల్తీ పాలను గుర్తించి తిరస్కరిస్తుండగా మరికొందరు మాత్రం తెలిసి కూడా పాలకు ఉన్న డిమాండ్‌తో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి పాలు ఎగుమతి చేసే వారు కల్తీ పాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

కల్తీపాల తయారీ ఇలా..

‘తెల్లనివన్నీ పాలు కాదు.. నల్లనివన్నీ నీళ్లు కాదు’ అన్నది నానుడి. ఇది ఇప్పుడు నిజమవుతోంది. గతంలో పాలలో నీళ్లు కలిపి కల్తీ చేసేవారు. ఆతర్వాత అధికపాల ఉత్పత్తి కోసం పశువులకు ఇంజక్షన్‌లు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా ప్రాణాలను హరించే పదార్థాలతో కల్తీ చేస్తున్నారు. కల్తీ పాలు తెల్లగా ఉండేందుకు పాలపొడి, లేదా పచ్చికొబ్బరిని ఉపయోగిస్తున్నారు. జిగురు వచ్చేందుకు సన్‌ప్లవర్‌ ఆయిల్‌ను మిక్స్‌ చేస్తున్నారు. నురుగు కోసం యూరియాను కలుపుతున్నారు. ఇలా రూ. 50 ఖర్చుతో నాలుగు లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :