తెలంగాణ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో… రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం బాధ కలిగించేదే అయినా… తప్పడం లేదని చెప్పారు. అయితే లాక్ డౌన్ విధించే అవకాశం లేదని… గత లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయామని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్బంగా టేస్మ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కరోనా పేరుతో ప్రైవేటు స్కూళ్లను మూసివేయడం దారుణమని అన్నారు.సినిమా థియేటర్లు, బార్లను తెరిచే ఉంచారని… దీనివల్ల కరోనా రాదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ప్రాంతాలకు వెళ్లరా? అని నిలదీశారు. ప్రభుత్వ గురుకులాల్లో కరోనా కేసులు వస్తే… శిక్ష తమకెందుకు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కట్టడి చేయాలనుకుంటే… ప్రతి వ్యవస్థను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వ్యవస్థలను తెరిచి ఉంచి, విద్యాసంస్థలను మాత్రమే మూసివేస్తామంటే కుదరదని అన్నారు.