గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్ భూతం పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో విచారణను కూడా ఎదుర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత… రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదని స్పష్టంగా చెప్పారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టుగానే కార్యాచరణ మొదలయినట్టుగా కనిపిస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఈరోజు బాధ్యతలను స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మీడియాతో మాట్లాడుతూ… డ్రగ్స్ మాఫియాకు హెచ్చరికలు జారీ చేశారు.
సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఉందని తెలుస్తోందని హైదరాబాద్ సీపీ అన్నారు. టాలీవుడ్ లో డ్రగ్స్ మూలాలు ఉన్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సినీ పెద్దలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పబ్స్, ఫామ్ హౌస్ యజమానులు, రెస్టారెంట్లను నిర్వహించేవారు డ్రగ్స్ ను ప్రోత్సహిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.