నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన బెంగళూరు సీఈవో సుచనా సేథ్ బ్యాగులో ఓ నలిగిపోయిన లేఖ లభించిందని శుక్రవారం గోవా పోలీసులు తెలిపారు. కొడుకు బాగుగులు చూసే విషయంలో ఆందోళనే ఆమెను ఆ దారుణ హత్యకు పురిగొల్పినట్లు అర్థమవుతున్నదని పోలీసులు వెల్లడించారు. అయితే కేసు దర్యాప్తు సాగుతున్నందున ఆ లేఖలో ఏమున్నదో ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు.
ఐ లైనర్‌తో టిష్యూ పేపర్‌తో రాసిన నోట్ నిందితురాలు సుచనా సేథ్ బ్యాగులో లభ్యమైందని కేసు దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆ నోట్‌ను తాము బయటపెట్ట దల్చుకోలేదని, బాబు బాగోగుల విషయంలో నెలకొన్న ఆందోళనే ఆమెను నేరానికి పురిగొల్పిందనే విషయం మాత్రం స్పష్టమవుతున్నదని ఆయన చెప్పారు.
కాగా, ఉత్తరగోవాలోని కండోలిన్ అపార్టుమెంటులో ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ (39) తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసింది. ఆమెకు, ఆమె భర్తకు గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో వారు విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. అనంతరం బాలుడి మృతదేహాన్ని బ్యాగులో కుక్కి బెంగళూరు తీసుకెళ్తుండగా గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.