- విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కీలక వ్యాఖ్యలు..
- ఎమ్మెల్యే బొల్లా పై పరోక్ష విమర్శలు..
- అభిమానులు కార్యకర్తలతో చర్చించి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి..
పల్నాడు జిల్లా వినుకొండ రాజకీయాల్లో కీలక పరిణామం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ ముఖ్య నేత మక్కెన మల్లికార్జునరావు వైసీపీని వీడడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మక్కెన మల్లికార్జున రావు వినుకొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరుపై ఆయన అసహనముతో ఉన్నట్లు మక్కెన పరోక్షంగా స్పష్టం చేయడమే కాకుండా.. ఒంటెద్దు పోకడ పనికిరాదంటూ నియోజకవర్గంలో కక్షలు కార్పన్యాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించొద్దని వినుకొండ లో ఎప్పుడు రౌడీయిజం లేదని పరోక్షంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరును ఆయన ఎండగట్టారు. వ్యక్తిగత విమర్శలు చేయనంటూనే వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి అంతా తానే చేశారన్న ధోరణి పనికిరాదంటూ బొల్లా ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు వినకొండకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన పదిమందిలో తాను ఒకడినని తన హయాంతో పాటు అందరూ ఎమ్మెల్యేల సహకారంతోని వినుకొండ అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పిన మక్కెన తన హయాంలో జరిగిన అభివృద్ధిని మీడియా సమక్షంలో వివరించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నానని కచ్చితంగా 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. అభిమానులు తన అనుచరులతో చర్చించి త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మక్కెన స్పష్టం చేశారు. మక్కెన తన అనుచరులతో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..