పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాప్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు భారీ షాక్ తగిలింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో (సైఫర్ కేసు) ఇమ్రాన్ కు పాకిస్థాన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన సన్నిహితుడు మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవలే నిలిపేసింది. అయితే, వెను వెంటనే ఆయన్ను సైఫర్ కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇమ్రాన్ రావల్పిండిలోని అడియాాలా జైలులో ఉన్నారు. కాగా, ఈ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతేడాది సెప్టెంబర్ లో ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై ఛార్జిషీట్ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైన్ జైల్లోనే ఇటీవల విచారణ చేపట్టారు. తాజాగా వీరికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
సైఫర్ కేసు అనేది దౌత్యపరమైన సమాచారానికి సంబంధించిన అంశం. గతేడాది మార్చిలో వాషింగ్టన్ లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. అయితే, ఈ కేసులో తనను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతుందని అప్పట్లో ఇమ్రాన్ ఆరోపించారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ నెలలో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాక్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించగా.. ఆగస్ట్ 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. అయితే, ఇస్లామాబాద్ హైకోర్టు ఆయన శిక్షను రద్దు చేయగా.. ఇతర కేసుల్లో ఆయన్ను పోలీసులు నిర్బంధించారు.