హైదరాబాద్ / పంజాగుట్ట : నగరం నడిబొడ్డున ఉండే ఈ ఠాణాకు దేశంలోనే అత్యుత్తమ పోలీ్‌సస్టేషన్‌గా గుర్తింపు ఉంది..! అత్యధికంగా ఎస్సైలు ఉండే ఈ స్టేషన్ ఇన్వెస్టిగేషన్‌కు పెట్టింది పేరు. ఈ ఠాణా పరిధిలో ఏ సంఘటన జరిగినా సంచలనమే..! అలాంటి పోలీ్‌సస్టేషన్‌కు నిర్లక్ష్యం, అవినీతి జాఢ్యం పట్టింది..! అధికారులు, సిబ్బంది తీరుతో ఠాణా ఖ్యాతి కాస్తా.. మసకబారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో, గతంలో కనీవినీ ఎరగని రీతిలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి బుధవారం మొత్తం ఠాణాను ప్రక్షాళన చేశారు. హోంగార్డు మొదలు ఎస్సై వరకు సిబ్బంది 85 మందిపై బదిలీ వేటు వేశారు. మంగళవారమే నగరంలో 53 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసిన సీపీ.. పంజాగుట్టకు కూడా ఎస్‌హెచ్‌వోను నియమించారు. బుధవారం ఠాణాలో పనిచేసే పలువురు హోంగార్డులు, ఆరుగురు ఎస్సైలు, 8 మంది ఏఎస్సైలు, 17 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. వెంటనే ఆ స్థానంలో కొత్త సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఠాణాలో ఎస్సైలు విజయానంద్, ప్రదీప్, మహేశ్, ఉపేందర్ మినహా.. దాదాపుగా అందరిపైనా బదిలీ వేటు పడింది. ఒకేసారి ఒకే పోలీ్‌సస్టేషన్‌లో 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం ఇప్పుడు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
వైఫల్యాలకు మచ్చుతునకలు..
గత నెల 23వ తేదీ రాత్రి ప్రజాభవన్ ఎదుట కారుతో బ్యారీకేడ్లను ఢీకొన్న ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన అభియోగాలపై బోధన్ మాజీ ఇన్‌స్పెక్టర్ ఇటీవలే అరెస్టయ్యారు. పంజాగుట్ట ఠాణా స్థాయిలోనే అక్రమాలు జరిగినట్లు అంతర్గత విచారణలో నిర్ధారణ అయ్యింది.
జూమ్ యాప్ ద్వారా కార్లు బుక్ చేసుకుని తప్పించుకుని తిరిగుతున్న ఘరానా నిందితుడు అమీర్‌అలీని పంజాగుట్ట పోలీసులు గతనెల 26న ఎట్టకేలకు అరెస్ట చేశారు. అయితే.. అతణ్ని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని, పారిపోయాడు.
గత ఏడాది జనవరి 31న పెట్రోకార్-2 సిబ్బంది ఎర్రమంజిల్‌లోని రహదారులు-భవనాల శాఖ కార్యాలయం ఆవరణలో విధినిర్వహణలో మద్యం సేవిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు.
అడపాదడపా ఈ స్టేషన్ సిబ్బందిపై డీసీపీ, సీపీలకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో సీపీ శ్రీనివా్‌సరెడ్డి నిజాలను నిగ్గుతేల్చాలంటూ నిఘావర్గాలను కోరారు. ఇంటెలిజెన్స్ పక్కా నివేదికతో ఒకేసారి పెద్దమొత్తంలో అధికారులు, సిబ్బందిని ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్) విభాగానికి అటాచ్ చేసినట్లు తెలిసింది.
146 మంది కొత్త సిబ్బంది
ఠాణా మొత్తాన్ని ప్రక్షాళన చేసిన పోలీసు కమిషనర్.. ఆ వెంటనే 146 మంది సిబ్బందికి పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు ఎస్సైలు, 8 మంది ఏఎస్సైలు, 18 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 70 మంది కానిస్టేబుళ్లు, 34 మంది హోంగార్డులు, ముగ్గురు ఎస్పీవోలు, నలుగురు ఎల్జీఈలు ఉన్నారు