ప్రజాపాలన దరఖాస్తులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలనను నిర్వహించింది. ఐదు గ్యారెంటీలపై తెలంగాణవ్యాప్తంగా అన్ని గ్రామాలు, నగరాలు, పట్టణాలలో దరఖాస్తులను స్వీకరించారు. తెలంగాణవ్యాప్తంగా 1.09 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12వ తేదీ నాటికి ప్రజాపాలన దరఖాస్తులను డిజిటలైజ్ చేశారు.
దరఖాస్తుల్లో 2.82 లక్షలను డూప్లికేట్‌గా గుర్తించారు. మరికొన్ని దరఖాస్తులలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లు లేవు. దరఖాస్తుల్లో కొంతమంది నెంబర్లను తప్పుగా రాశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అర్హులైన దరఖాస్తుదారులు నష్టపోకుండా ఉండేందుకు వాటిని పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.