హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సియం వైఎస్ జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్, జగన్ ఏకాంత చర్చలు జరిపినప్పుడల్లా అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో ఏపీకి 500 టీఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తరలించిందని మండిపడ్డారు.
ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్ అడ్డు చెప్పలేదని విమర్శించారు. మన నీళ్లు ఏపీకి వెళుతుంటే కేసీఆర్ నిశ్శబ్దంగా ఉన్నారన్నారు. కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకొని కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారన్నారు. మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.