contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో రాజ్యసభలో ప్రధాని మాట్లాడారు. ఈ సమయంలో నెహ్రూ కాలం నుంచి యూపీఏ వరకు జరిగిన వివిధ అంశాలను వివరిస్తూ నిప్పులు చెరిగారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎప్పుడూ అనుకోలేదని… కానీ తమ కుటుంబ సభ్యులకు మాత్రం ఇచ్చుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రాత్రికి రాత్రే కూల్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇప్పుడు దేశాన్ని ఉత్తరం, దక్షిణం అంటూ రెండు ముక్కలు చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయని విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ పార్టీని స్థాపించిందే ఓ బ్రిటిషనర్ అని… అందుకే ఆ పార్టీ భారతీయ సంస్కృతిని అసహ్యించుకుంటుందని ఆరోపించారు. బ్రిటిష్ పార్లమెంట్ ఎలా నడిస్తే మన పార్లమెంట్‌ను కాంగ్రెస్ వారు అలా నడిపించారని విమర్శించారు. విదేశీ వస్తువుల్ని కాంగ్రెస్ స్టేటస్ సింబల్‌గా భావించిందని… కానీ ఆ బానిసత్వపు గుర్తులను మేం చెరిపేస్తున్నామని మోదీ అన్నారు. బానిసత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. యుద్ధవీరులకు కనీసం గౌరవం ఇవ్వలేదని… అమరవీరుల కోసం వారికి ఓ మెమోరియల్ కూడా నిర్మించలేదన్నారు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకువచ్చాం

ఈ పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను తాము ఐదో స్థానానికి తీసుకు వచ్చామని స్పష్టం చేశారు. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ పురోగతిని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ యూపీఏ హయాంలోనే నాశనం అయిందని ఆరోపించారు. తాము దళితులు, యువత, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. అయిదేళ్లలో ప్రజారవాణా వ్యవస్థ తీరు మారబోతుందన్నారు.

రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు

ఉద్యోగాలలో రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని మోదీ పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపించారు. రిజర్వేషన్లు దేశాన్ని అస్థిరపరుస్తాయని నెహ్రూ అన్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి నెహ్రూ రాష్ట్రాలకు లేఖలు రాసినట్లు రికార్డుల్లో ఉందన్నారు.

370 రద్దు చేయకుండా దళితులకు అన్యాయం చేసింది

కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370ని దశాబ్దాల పాటు రద్దు చేయలేకపోయిందని మండిపడ్డారు. తాము మాత్రం 370ని రద్దు చేసి జమ్ము కశ్మీర్ దళితులకు న్యాయం చేశామన్నారు. అట్రాసిటీ యాక్టులో కావాలనే జమ్ము కశ్మీర్‌ను చేర్చకుండా దళితులకు అన్యాయం చేశారన్నారు. సీతారాం కేసరి ఓబీసీ కావడంతో ఆయనను కాంగ్రెస్ వేధించిందని ధ్వజమెత్తారు. నెహ్రూ ఘనతను పెంచడం కోసం అంబేడ్కర్‌ను శ్యాంపిట్రోడా అవమానించారన్నారు. గిరిజన రాష్ట్రపతిని కూడా కాంగ్రెస్ అవమానించింది… వ్యతిరేకించిందని ఆరోపించారు. యూపీఏ హయాంలో ఒక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అయినా ఇచ్చారా? అని నిలదీశారు.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే స్లోగన్ కాదు…

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే స్లోగన్ కాదని.. మోదీ హామీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. తాను స్వతంత్ర భారతంలో పుట్టానని… తన ఆలోచనలు స్వతంత్రంగానే ఉంటాయన్నారు. గతంలో ఎప్పుడూ చూడని అభివృద్ధిని ఈ పదేళ్లలో చూశామన్నారు. ఖర్గే చాలా స్వేచ్ఛగా మాట్లాడారని.. బీజేపీకి 400 సీట్లు రావాలని అన్నారని గుర్తు చేశారు. ఆయనకు అంత స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందో? అని ఎద్దేవా చేశారు.

పీఎస్‌యూలు పెరిగాయి

ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తున్నారని తనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ను ఎవరు నాశనం చేశారు? హెచ్ఏఎల్, ఎయిరిండియాను ఎవరు దెబ్బతీశారు? అని నిలదీశారు. 2014లో 234 పీఎస్‌యూలు ఉంటే ఇప్పుడు 254కు చేరుకున్నాయని గుర్తు చేశారు. పీఎస్‌యూలపై ఇన్వెస్టర్ల విశ్వాసం కూడా పెరిగిందన్నారు. గతంలో ఇలాంటి విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. బీఎస్ఈ పీఎస్‌యు ఇండెక్స్ దశాబ్దకాలంలోనే రెట్టింపు అయిందన్నారు. ఈ పదేళ్లలో పీఎస్‌యూల విలువ రూ.9.5 లక్షల కోట్ల నుంచి రూ.17 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :