ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి తెలంగాణ మంత్రి కొండా సురేఖ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి గురువారం ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు ముందుగా ఏపీలో తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేటట్లుగా చూసుకోవాలని.. ప్రభుత్వం పడిపోయేలా చేసుకోవద్దని సూచించారు. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో (వచ్చే ఎన్నికల్లో) వైసీపీ ప్రభుత్వం కూలిపోకుండా చూసుకోవాలని ఆమె చురక అంటించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిదేళ్ళు ఉంటుంది
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులే కూల్చుతారని చెప్పేవారు పగటి కలలు కంటున్నారని కొండా సురేఖ అన్నారు. వారి పగటి కలలు నిజం కాబోవన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అయిదేళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. ఈ కాలంలో తాము ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు.
కవితకు మాట్లాడే నైతిక అర్హత లేదన్న కొండా సురేఖ
టీఎస్‌పీఎస్సీపై ఎమ్మెల్సీ కవితకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేలాదిమంది విద్యార్థులు అన్యాయానికి గురయ్యారన్నారు. అందుకే టీఎస్‌పీఎస్సీ అనే పదం ఉపయోగించే హక్కు కూడా వారికి లేదన్నారు. చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం ప్రభుత్వపరమైనదన్నారు. ఆమెకు పనీపాటా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారం పోవడంతో ఆమెకు ఎక్కడి నుంచీ డబ్బులు రావడం లేదన్నారు. అందుకే ఒత్తిడిలోకి వెళ్లిపోయారని, అందుకే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.
తెలంగాణ అంటే టీజీ
టీఎస్ అంటే ఎవరూ అంగీకరించరన్నారు. ఏ రాష్ట్రంలోనూ రాష్ట్రం పేరుకు ఎస్ అని ఉపయోగించలేదని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ అంటే టీజీ మాత్రమే అన్నారు. ఇక తెలంగాణ గీతాన్ని ఉద్యమం సమయంలో అందరూ అంగీకరించిందే అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ గీతాన్ని అధికారికం చేస్తామని చెప్పారని.. కానీ వారు చేయలేదని, ఇప్పుడు తాము చేశామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెలమదొరలా తయారు చేశారని… అందుకే విగ్రహాన్ని కూడా మార్చాలని నిర్ణయించామన్నారు.