contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేటీఆర్ పై అసెంబ్లీలో పంచ్‌లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యాన్ని మహిళల కోసం తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కానీ ఆటోడ్రైవర్లకు నష్టం జరుగుతోందని ప్రతిపక్ష సభ్యులు అనడం సబబుకాదన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన శుక్రవారం మాట్లాడారు. డ్రైవర్ల కష్టాలు తెలుసుకునేందుకు మాజీ మంత్రి కేటీఆర్‌ ఇటీవల ఆటోలో ప్రయాణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ పంచ్‌లు వేశారు. కృష్ణనగర్‌లో ఒకాయన ఆటో రాముడు ఉన్నాడని, అక్కడ మొత్తం సినిమాకు సంబంధించిన వాళ్లు, సురభి నాటకాలు వేసేవాళ్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారని కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ అన్నారు. బీఆర్ఎస్‌కు చెందిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ అక్కడేదో సమావేశానికి వెళ్లారని, అక్కడ ఆటో కనిపించిందని, ఆటో రాముడు ఆటో ఎక్కి ఆఫీస్‌కి పోయాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ ఆటో లోపల కెమెరా పెట్టారని, అతడు ఎక్కింది దిగింది షూటింగ్‌లు చేయడానికి ఈ కెమెరాను అమర్చారని విమర్శించారు.

‘‘ఏంది ఈ డ్రామాలు. తెలంగాణ సమాజంలోని ఆడబిడ్డలను అక్కున చేర్చుకోవాలనే సదుద్దేశంతో, మంచి ఆలోచనతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించాం. 2014 నుంచి 2019 మంత్రివర్గంలో ఒక ఆడ బిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నవాళ్లు ఏ రోజు కూడా ఎందుకు ఇవ్వలేదని అడగలేదు. ఆ సాహసం చేస్తే ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుందనే సంగతి వాళ్లకు తెలుసు కాబట్టే అడగలేదు. ఆ ప్రభుత్వం మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డల కోసం మా మంత్రి పొన్నం ప్రభాకర్, మేము ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఇప్పటివరకు దాదాపు 15 కోట్ల 21 లక్షల మంది ఆడబిడ్డలు ప్రయాణించారు. రూ.535.52 కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చుపెట్టింది. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఫర్వాలేదు. కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి తగలబెట్టడం సరికాదు. కిరాయి డబ్బులే రావడం లేదు, సంసారం నడవడంలేదన్న ఆటో డ్రైవర్.. ఆటోని తగలబెట్టాడంటే అతడికి ఎన్ని డబ్బులు కావాలి? ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు? ఇంకో నటుడేమో రూ.100 పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసల అగ్గి పెట్టె కొనుక్కోడు. అతడికి అగ్గిపుల్ల దొరకదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :