contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై సియం రేవంత్ రెడ్డి చర్చ

Telangana: పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు హైపవర్ కమిటీతో సమావేశమై చర్చించారు. త్వరలో పలు పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై అడ్వొకేట్ జనరల్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఏజీ సుదర్శన్ రెడ్డి, అదనపు ఏజీ రంజిత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ జిల్లాల జనాభా ప్రాతిపదికన టీఎస్ఎస్పీ పోస్టులు కేటాయిస్తే గ్రామీణ యువతకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. కటాఫ్ మార్కు వ్యత్యాసంతో రాజధాని ప్రాంతానికే ఎక్కువగా ఉద్యోగాలు దక్కుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే టీఎస్ఎస్పీ రాష్ట్రస్థాయి పోస్టులు కాబట్టి కటాఫ్ మార్కులు రాష్ట్రస్థాయిలోనే పరిగణించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టీఎస్ఎస్పీ నియామకంలో జీవో నెంబర్ 46ని మినహాయించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.

కొత్త జిల్లాల మేరకు ఉద్యోగుల భర్తీ జరగాలని రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీడీసీ అంశం తెరమీదికి వచ్చింది. టీఎస్ఎస్పీ బెటాలియన్లు అన్ని జిల్లాలో లేకపోవడంతో పక్కపక్కనే ఉన్న మూడు నాలుగు జిల్లాలను కలుపుతూ సీడీసీ కేడర్‌ను నిర్ణయించారు. ఈ ప్రాతిపదికన పోస్టులను కేటాయించేందుకు నాటి ప్రభుత్వం జీవో నెంబర్ 46ను జారీ చేసింది.

కానీ రెవెన్యూ జిల్లాల వారీగా జనాభాను పరిగణలోకి తీసుకొని పోస్టులను భర్తీ చేస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన పోస్టులను కేటాయిస్తే గ్రామీణ జిల్లాలకు తక్కువ పోస్టులు రావడంతో పాటు… అలాగే కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఎక్కువ మార్కులు సాధించినా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కోల్పోయే వారు ఉంటారని పలువురు అభ్యర్థులు అభ్యంతరం చెబుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా పోస్టులు ఉండడమే కాకుండా… తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో గ్రామీణ అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :