- మల్కాజ్గిరి బిజెపి పార్లమెంట్ నాయకుడు మల్క కొమురయ్య
మేడ్చల్ /కాప్రా : పదేళ్ల నరేంద్రమోడీ ప్రభుత్వ పాలనను వివరిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ సీనియర్ నాయకులు, పల్లవి విద్యాసంస్థల చైర్మన్ మల్క కొమురయ్య ఆధ్వర్యంలో సైనిక్ పురి నుండి కుషాయిగూడ వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు మూడో సారి మోడీ కోసం జన చైతన్య యాత్ర చేపట్టారు. 1000 మంది నాయకులు, కార్యకర్తలతో యాత్ర చేపట్టిన మల్క కొమురయ్య బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోడీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. అలాగే కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి దేశాన్ని ఆదర్శవంతంగా పాలిస్తున్నాడని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలోనే సూపర్ పవర్ గా చేయడానికి నరేంద్రమోడీ నిరంతరం కృషి చేస్తున్నాడని కొనియాడారు. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.