కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఆమె ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. 77 ఏళ్ల సోనియా తొలిసారి రాజ్యసభకు పోటీ చేశారు. ఈ నెల 15న రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఆమె నామినేషన్ వేశారు. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీతో పాటు బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ముగ్గురూ ఎన్నికయినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సోనియాగాంధీ స్థానంలో ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు. 2006 నుంచి ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంటుకు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో నాయకురాలు సోనియాగాంధీ. 1964లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
సోనియా 1999 (అమేథి/బళ్లారి), 2004 (రాయ్ బరేలీ), 2006 (రాయ్ బరేలీ), 2009 (రాయ్ బరేలీ), 2014 (రాయ్ బరేలీ), 2019 (రాయ్ బరేలీ)లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు మొదటిసారిగా పెద్దల సభలో కాలుమోపనున్నారు.