- డ్యూటీలో ఉన్న ఎస్సైని కొట్టిన ఎస్పీ
- మేడారం జాతరలో ఘటన
- కుటుంబసభ్యుల ముందే..
మేడారం జాతర విధుల్లో ఉన్న ఓ ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారి చేయిచేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కుటుంబ సభ్యుల ముందే అవమానించడం చర్చనీయాంశమైంది. విధుల్లో ఉన్న పోలీసులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. ఉన్నతాధికారులు కల్పించుకుని సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. మేడారంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ కమిషనరేట్ కు చెందిన ఏఆర్ ఎస్సై రవికుమార్ మేడారంలో జాతరలో డ్యూటీ చేస్తున్నారు. జాతరలో రోప్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను క్యూలో పంపించే ప్రయత్నం చేస్తున్న రవికుమార్‌పై అక్కడ డ్యూటీలో ఉన్న ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం సీరియస్ అయ్యారు. డ్యూటీ వదిలేసి ఫ్యామిలీని.. లోపలికి పంపుతావా అంటూ కుటుంబ సభ్యుల ముందే రవికుమార్‌పై చేయి చేసుకున్నారు.
దీంతో రవికుమార్ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. తన భర్తను మర్డర్ చేసిన నేరస్థుడిలాగా ట్రీట్ చేశారని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కాలర్ పట్టుకొని నేరస్థుడిలా లాక్కొని వెళ్లారన్నారు. ఎస్పీకి హోదా ఉందని కాలు మీద కాలేసుకొని కూర్చొని తన భర్తను నేలపై కూర్చోబెట్టారన్నారు. తాను ఓ బెగ్గర్‌లాగా ఎస్పీ కాళ్లు పట్టుకొని బతిమిలాడినా వినకుండా ఆయన పాస్ లాక్కొని నీచంగా ప్రవర్తించారన్నారు. ఆడబిడ్డ కాళ్లు పట్టుకున్నా.. కనికరించలేదని రవి కూమార్ భార్య మీడియా ముందు వాపోయారు.